తెలంగాణలో అన్ని పార్టీలు ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికపైనే కాన్సస్ట్రేట్ చేశాయి. అన్నిపార్టీలు తమ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్ , బీజేపీ , కాంగ్రెస్‌లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. టీఆర్ఎస్ ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీలను తూర్పారబడుతూ మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రచారం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రచార కార్యక్రమంలో ఆయన సవాళ్లు విసురుతూ విపక్ష పార్టీలను డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆయన బీజేపీనే టార్గెట్‌గా చేసుకుని ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ నేతల ఎదురు దాడి
అయితే, హరీష్ రావు చేస్తున్న ప్రచారాన్ని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. దుబ్బాక అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమని హరీష్ రావు చెబుతుంటే గజ్వేల్, సిద్ధిపేటల్లో జరిగిన అభివృద్ధి ఇక్కడెందుకు లేదంటూ ఎదురు దాడి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగిస్తుందని హరీష్ రావు చెబుతుంటే బిల్లులదంతా రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం మేరకే ఉంటుందంటున్నారు బీజేపీ నేతలు. పెన్షన్ల వ్యవహారంపై చర్చ కాస్త హీట్‌ను పుట్టించింది. దుబ్బాక బస్టాండ్‌లో చర్చకు రావాలంటూ హరీష్ సవాల్ విసిరితే అభివృద్ధి అంతా ఆ బస్టాప్ లోనే కనిపిస్తుందంటూ విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. ఓట్ల కోసం వచ్చిపోయే పార్టీలు కాంగ్రెస్ , బీజేపీలని, తానిక్కడే ఉండి అభివృద్ధి చేస్తానంటూ హరీష్ దుబ్బాక ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి ఆ తరువాత పత్తా లేకుండా పోవడం టీఆర్ఎస్ పార్టీకి, ఆ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ప్రజలకు చెబుతున్నాయి విపక్ష పార్టీలు. ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గ ప్రజలను సంతృప్తి పరిచేందుకు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని, ఆ తరువాత ఆ నియోజక వర్గం ఏమైపోయినా పరవాలేదన్నట్టుగా చూస్తుంటుందని బీజేపీ నేతలు గట్టిగానే విమర్శిస్తున్నారు.
అర్థం కాని పరిస్థితి
దీంతో టీఆర్ఎస్‌ను గట్టెక్కించేందుకు హరీష్ రావు చేస్తున్న విమర్శలు ఆ పార్టీకి బలాన్నిస్తాయా లేక ఇబ్బందుల్లోకి నెడతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో విజయం సాధించటమే కాకుండా బీజేపీకి గతంలో వచ్చిన ఓట్లు రాకుండా చేయాలని హరీష్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న భావనలో బీజేపీ నేతలున్నారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం, హరీష్ చేస్తున్న ప్రకటనలను అక్కడికక్కడే గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు తిప్పికొడుతుండటంతో ఈ ఎన్నికలో టీఆర్ఎస్ , బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్లుంది. దుబ్బాక ఓటర్లు ఎవరికి పట్టం కడతారో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.











