ఏపీలో ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇసుక తవ్వకాలు జేపీ కంపెనీకి అప్పగించడం ద్వారా రూ.2500 కోట్ల దోపిడీకి తెరలేపారని ఆయన రాజమండ్రిలో ఆరోపించారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాల ద్వారా జేపీ కంపెనీ రోజుకు రూ.10 కోట్లు అదనంగా వసూలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఏటా జేపీ కంపెనీ రూ.3600 కోట్లు వసూలు చేస్తూ ప్రభుత్వానికి కేవలం రూ.750 కోట్లు మాత్రమే చెల్లిస్తోందని ఆయన విమర్శించారు. భారీగా ఇసుక తరలిస్తూ జీఎస్టీ కూడా ఎగవేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సీబీఐ విచారణ జరిపించాలి
ఏపీలో దోపిడీలో రూ.2500 కోట్లు కొట్టేస్తున్నారని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. ఇసుక ర్యాంపు నుంచి 5 కిలోమీటర్ల దూరానికి కూడా రూ.9000 రవాణా ఖర్చులు వసూలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పర్యవరణ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. జేపీ కంపెనీ పేరుతో ఇటు ఇసుక ధరలు పెంచడం ద్వారా, రవాణా ఖర్చుల పేరుతో ఇసుక భారీ దోపిడీకి తెరలేపారని, తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీసు ఆధ్వర్యంలోనే దోపిడీ కొనసాగుతోందని విమర్శించారు. ఏపీలో మైనింగ్ మాఫియా తయారైందని, చెడ్డీ గ్యాంగు మాదిరి తయారయ్యారని అన్నారు. గోదావరి నదిలో 50 అడుగుల లోతైన గోతులు తవ్వుతున్నారని, పొక్రెయినర్లు వాడకూడదని నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. ఇసుక కొనుగోలు చేసిన వారికి ఎవరికి కూడా బిల్లులు ఇవ్వడం లేదని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని బుచ్చయ్య చౌదరి తెలిపారు. వెంటనే దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- ఇసుక ద్వారా పదివేల కోట్ల దోపిడీకి ప్లాన్.. ఆధారాలతో వెల్లడించిన జవహర్











