కరోనా కట్టడికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలవడంతోపాటు, దేశీయంగా స్పుత్నిక్ టీకా తయారు చేసే కంపెనీలకు పెద్దఎత్తున ముందస్తు చెల్లింపులు జరిపి వారి నుంచి నేరుగా కోవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం గ్లోబల్ టెండర్లు పిలిచామని, అయినా ఎవరూ ముందుకు రాలేదని చెబుతోంది. రష్యాలో అభివృద్ధి పరిచి, దేశీయంగా అనేక కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్దంగా ఉన్న స్పుత్నిక్ టీకాను సరఫరా చేసేందుకు సిధ్ద పడుతున్నాయి. అయితే ముందుగా ఆర్డర్లు పెట్టి, అడ్వాన్లులు చెల్లింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా కంపెనీలు టీకాలు సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం టీకాల కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే టీకాలను మాత్రమే జనాలకు వేస్తున్నారు. స్తోమత ఉన్న వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించి టీకాలు వేయించుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం కోవిడ్ టీకాలు మొత్తం కేంద్రమే సరఫరా చేయాలని,అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి లేఖ రాయడం సంచలనంగా మారింది.
వారికెలా దొరుకుతున్నాయి..
దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే పెద్ద ఎత్తున కోవిడ్ టీకాలకు ఆర్డుర్లు పెట్టాయి. ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు నేరుగా సరఫరా చేస్తున్నాయి. మహారాష్ట్ర 4 కోట్ల టీకాలకు ముందస్తు చెల్లింపులు చేసింది. యూపీ ప్రభుత్వం 8 కోట్ల టీకాలు కొనుగోలు చేసేందుకు నిధులు విడుదల చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలవడం ద్వారా 40 కోట్ల టీకాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు తయారీ దారులు అంగీకరించారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి యూపీ ప్రభుత్వం నేరుగా కోవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేయడంలో విజయం సాధించింది. తెలంగాణ ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్లకు అస్ట్రాజెనికా, స్పుత్నిక్ తయారీ దారులు స్పందించారు. హర్యానా ప్రభుత్వానికి నేరుగా స్పుత్నిక్ వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు పలు కంపెనీలు అంగీకరించాయి. కర్నాటక ప్రభుత్వం పిలిచిన గ్లోబల్ టెండర్ల ద్వారా స్పుత్నిక్ వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు రెండు కంపెనీలు ముందుకు వచ్చాయి.ఇలా పలు రాష్ట్రాలు టీకాలు సొంతంగా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రమే ఉచితంగా సరఫరా చేయాలని కొత్త వాదం తెర మీదకు తీసుకువచ్చింది.
Must Read ;- విదేశీ టీకాలకు లైన్ క్లియర్.. డీసీజీఐ అనుమతి
టీకాలకు ఖర్చుచేసే ఆలోచన లేదు..
ఏపీ ప్రభుత్వానికి కోవిడ్ టీకాలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసే ఆలోచన లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన టీకాలు మినహా రాష్ట్ర ప్రభుత్వం టీకాలు కొనుగోలు చేసింది లేదు. అసలు అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం నవరత్నాలు అమలు చేస్తే చాలు, కరోనా బారినపడి జనం చచ్చినా పరవాలేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని ప్రతిపక్షాల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏపీలో అందరికీ రెండు డోసుల టీకాలు వేయాలంటే కనీసం 11 కోట్లు అవసరం అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కేవలం కోటి 20 లక్షలు మాత్రమే సరఫరా చేసింది. ప్రతి నెలా 14 లక్షల టీకాలు ఏపీకి కేటాయించారు. ఇలా కేంద్రమే టీకాలు సరఫరా చేసి, అందరికీ టీకాలు అందాలంటే రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం స్వయంగా టీకాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. టీకాలు కొనుగోలు చేసేందుకు రూ.1600 కోట్లు ఖర్చు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రి కొడాలి నాని ప్రకటించారు. అయితే మార్కెట్లో టీకాలు అందుబాటులో లేవని వారే చెబుతున్నారు. దేశంలో దాదాపు 20 కంపెనీలతోపాటు, బయోలాజికల్ ఇ కంపెనీలు ఆగష్టు నుంచి పెద్ద ఎత్తున టీకాలు ఉత్పత్తి చేసేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు టీకాలు దొరక్కపోయినా ఆగష్టు నుంచి ముందస్తు డబ్బు చెల్లించేవారికి కావాల్సినన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం టీకాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదు.
జనం చచ్చినా పట్టదా?
ఇప్పటికే ఏపీలో 16 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 11,200 మంది చనిపోయారు. ఇంకా ఏపీలో లక్షా 38 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రతి రోజూ సగటున 11 వేల మంది కోవిడ్ బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్ ఉదృతి కొంచెం తగ్గినా మూడో వేవ్ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా ఏపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. కనీసం 5కోట్ల డోసులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే, కేంద్రం మరో 4 కోట్లు సరఫరా చేస్తుందని వారు గుర్తు చేస్తున్నారు. డిసెంబరు నాటికి అందరికీ టీకాలు వేయాలంటే కనీసం నెలకు కోటి 10 లక్షల డోసుల టీకాలు అవసరం అవుతాయని అంచనా. అయినా ఏపీ ప్రభుత్వం కేవలం కేంద్రం సరఫరా చేస్తున్న టీకాలను మాత్రమే జనాలకు వేస్తూ కాలయాపన చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. జనం చచ్చినా పరవాలేదు. తాము మాత్రం టీకాలు కొనుగోలు చేయం అనే మొండి వైఖరి విడనాడాలని ప్రతిపక్షాల నేతలు కోరుతున్నారు.
Also Read ;- సంక్షేమం ముసుగులో ప్రజలను మభ్యపెడుతున్న జగన్: యనమల











