జగనన్న శాసిస్తాడు.. ఆ నరేంద్ర మోదీ పాటిస్తాడు. అదేంటి దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం కదా పాటించేది అని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు జగనన్న తమ్ముళ్లు ఇదే పాట పాడుతున్నారు. మా అన్నఏది చెబితే అది మోదీగారు ఫాలో అయిపోతున్నారని.. ఉదాహరణలతో సహా చెప్పి డప్పు మోగిస్తున్నారు. జోన్ల వారీగా నిబంధనలు కరోనా విషయంలో పెట్టాలనగానే మోదీ పెట్టారని.. గ్లోబల్ టెండర్లకు అనుమతి ఇవ్వాలని కోరగానే…అనుమతి ఇచ్చారని.. వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా కేంద్రమే ఇవ్వాలని కోరగానే..మోదీ సైతం అదే చేశారని ఫ్యాన్ ఫ్యాన్స్ మోత మోగిస్తున్నారు. దీంతో రీసెర్చ్ చేసిన వారికి కొత్త విషయం తెలిసింది.
సమాచారం ఢిల్లీ నుంచి తాడేపల్లికి..
కేంద్రంలో ఏదైనా ప్రతిపాదన దశలోనో, చర్చల దశలోనో ఉండగానే..ఆ సమాచారం ఢిల్లీ నుంచి తాడేపల్లికి వచ్చేస్తుందంట. ఆ సమాచారం ఆధారంగా.. జగన్మోహన్‌రెడ్డి వెంటనే ఓ లేఖ సంధిస్తున్నారంట. ఆ ప్రతిపాదన నిర్ణయం దశకు వస్తే.. క్రెడిట్ మనదే అని చెప్పుకోవచ్చు..ఒక వేళ రాకపోతే మనం మంచి సూచన చేసినా కేంద్రం పట్టించుకోలేదని అనొచ్చు. అదీ సంగతి. అలాగే ఇప్పుడు జగన్ కేంద్రానికి వరుసగా లేఖలు రాస్తున్నారంట.
చిన్న పిల్లలాటన్న మోదీ
అయితే వీరికి కేంద్రంలోని ప్రతిపాదనల సారాంశం ఎలా తెలుస్తుందనేదే ప్రశ్న. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర ఉండే ఓ అధికారికి… మరో అధికారి క్లోజ్ ఫ్రెండ్ అంట. ఆ అధికారి తన ఫ్రెండ్లీ అధికారికి చెబితే.. ఈ అధికారి తాడేపల్లికి సమాచారం పంపుతున్నాడంట.ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి ప్రధాని చెవిన పడిందంట. అయితే ‘‘ఇవన్నీ చిన్నపిల్లలాటలు..జగనే తర్వాత తెలుసుకుంటాడు..వీటి వల్ల ఉపయోగం లేదని‘‘ అన్నారంట.
ఉచిత వ్యాక్సిన్‌పై మూడు నెలల నుంచి చర్చ..
ఇదంతా ఆఫ్ ద రికార్డ్. అయితే మన కళ్ల ముందు కనపడే విషయాలు కూడా ఉన్నాయి. కరోనా విషయంలో నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే వ్యాక్సిన్ విషయంలో అందరికీ ఉచితమనే కీలక నిర్ణయాన్నితీసుకుని ప్రకటించారు. దాని వలన డ్యామేజ్ అయిన ఇమేజ్‌ను మళ్లీ తిరిగి పొందచ్చనేదే వ్యూహం. అంతే గాని జగన్ చెప్పారనో.. లేఖ రాసారనో కాదు. వ్యాక్సిన్ ఉచితంపై మూడు నెలల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. అలాంటిది దానిని జగన్ కనిపెట్టి.. మోదీకి చెబితేనే తెలిసిందని ప్రచారం చేసుకోవడం నిజంగానే చిన్న పిల్లలాటే అవుతుంది.
Must Read ;- గ్లోబల్ టెండర్లు ఉత్తుత్తిదేనా.. ఏపీకి ఎందుకు వ్యాక్సిన్లు దొరకడం లేదు?