వైసీపీ నేతలు పెన్నా నదిలో వందలాది ట్రాక్టర్లు పెట్టి రాత్రి పూట అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని టీడీపీ నేత ఆనం వెంకట రమాణారెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అక్రమంగా రాత్రి పూట తవ్వుతున్న వీడియోను ఆనం వెంకట రమణా రెడ్డి మీడియాకు చూపించారు. జలవనరుల మంత్రి అనిల్ యాదవ్ బినామీలే పెన్నాలో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. రోజుకు రూ.30 లక్షలు మంత్రికి చెల్లించి ఇసుక అక్రమంగా తవ్వుకుంటున్నారని వెంకట రమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పెన్నాలో రాత్రి 8 గంటలకు అక్రమ తవ్వకాలు మొదలు పెట్టి ఉదయం 5 గంటల వరకు ఈ అరాచకాలు సాగిస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు. అక్రమంగా తవ్విన ఇసుకను లారీల్లో బెంగళూరు తరలించి ఒక్కో లారీ లక్ష రూపాయలకు అమ్ముకుంటూ దోచుకుతింటున్నారని ఆనం ధ్వజమెత్తారు.
ప్రభుత్వానికి ఒక్క రూపాయి కట్టడం లేదు
ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా రోజుకు రూ.30 లక్షల విలువైన ఇసుక దోచుకుంటున్నారని ఆనం మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఇలా పది రోజుల్లోనే రూ.3 కోట్ల విలువైన ఇసుకను దోచుకున్నారని ఆయన విమర్శించారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు మొద్దు నిద్ర పోతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి అనిల్ యాదవ్, ఆయన అనుచరుల దోపిడీకి అడ్డే లేకుండా పోయిందని ఆనం వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Must Read ;- వైసీపీ మంత్రిని ‘జిప్పుబాబా’తో పోల్చిన టీడీపీ నేత!











