విజయవాడ నగరంలో 7 కిలో మీటర్ల సూపర్‌స్ట్రక్చర్ ఫ్లైఓవర్ రానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే అమరావతి భవిష్యత్తు అసరాలకు కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలిస్తూ వస్తున్నాయి. విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కిలో మీటర్ల మేర సూపర్‌స్ట్రక్చర్ బ్రిడ్జి నిర్మాణం వంటి ప్రాజెక్టులను ఎన్‌హెచ్‌ఏఐ 2024-25 యాన్యువల్ ప్లాన్ లో చేర్చింది. వీటితోపాటు రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చింది. వాటికి రూ.12,029 కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు ఎంత త్వరగా సహకరిస్తే, అంత వేగంగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.
చెన్నై-కోల్‌కతా హైవే విజయవాడ మీదుగా వెళ్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై మహానాడు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా నిడమానూరు వరకు.. ప్రస్తుత హైవేపై నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి వార్షిక ప్రణాళికలో చోటుకల్పించారు. 7 కి.మీ. మేర ఇన్నోవేటివ్ సూపర్‌స్ట్రక్చర్ డిజైన్‌తో ఈ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. దీనికి రూ.669 కోట్లు కానుంది. భూసేకరణ చేయకుండానే, ప్రస్తుతమున్న హైవే డివైడర్లలో పిల్లర్లు వేయబోతున్నారు. మొత్తం నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మిస్తారు. దీనికి భూసేకరణ అవసరం లేకపోవడంతో డీపీఆర్ సిద్ధంచేసి, టెండర్లు పిలిచి, మార్చిలోపు గుత్తేదారుకు పనులు అప్పగించేందుకు వీలుంది.
తూర్పు బైపాస్ చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌కు అభిముఖంగా తూర్పువైపు మరో బైపాస్ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఏఐ రెడీ అయింది. 50 కి.మీ. ఈ బైపాస్‌కు రూ.2,716 కోట్లు కేటాయించారు. దీనికోసం 3 ఎలైన్‌మెంట్లు రెడీ చేశారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఈ వారంలో కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి, ఈ ప్రాజెక్టు గురించి వివరించనున్నారు. నెలాఖరుకు మూడు ఎలైన్‌మెంట్లను ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయానికి పంపాలి. వాటిలో ఒకటి ఖరారైతే.. డీపీఆర్ రూపకల్పన, భూసేకరణ చేస్తారు.
ఇంకా మరెన్నో రహదారుల ప్రాజెక్టులు పట్టాలకెక్కనున్నాయి. వినుకొండ – గుంటూరు వరకు 90 కి.మీ. హైవేను 4 లైన్స్ గా విస్తరించనున్నారు. దీనికి రూ.2,360 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు వరకు 108 కి.మీ. మేర 4 వరుసలుగా హైవేను విస్తరిస్తారు. ఈ ప్రాజెక్టుకు రూ.3,723 కోట్లు..
నెల్లూరు – కృష్ణపట్నం పోర్టు వరకు 24 కి.మీ. 4 వరుసల హైవేకి రూ.1,040 కోట్లు.. రాజమహేంద్రవరం వద్ద గామన్ జంక్షన్‌లో 2 కి.మీ. ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.150 కోట్లు కేటాయించారు. ఇంకా విశాఖ జిల్లాలోని సబ్బవరం నుంచి షీలానగర్ కూడలి వరకు 13 కి.మీ. నిర్మాణానికి రూ.906 కోట్లు.. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం కియా పరిశ్రమ వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఆర్వోబీ నిర్మాణానికి రూ.140 కోట్లు కేటాయించారు.











