సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మగ్గాన్ని నమ్ముకున్న నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా..జాతీయ చేనేత దినోత్సవం రోజున భారీ కానుకను సిద్ధం చేసింది. అర్హులైన చేనేత కుటుంబాలకు నేరుగా రూ.25,000 ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాపట్ల జిల్లా చేనేత క్షేత్రం చీరాల వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
చేనేత వృత్తిలో ఉన్నవారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పెట్టుబడి. నూలు, రంగుల కొనుగోలుతో పాటు పాతబడిన మగ్గాల ఆధునీకరణకు నిధుల కొరత వేధిస్తుంటుంది. ఈ సంక్షోభం నుంచి వారిని బయటపడేయడానికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71,536 చేనేత కుటుంబాలకు ఏకంగా రూ.179 కోట్లను ఒకే విడతలో విడుదల చేస్తోంది. ఇంట్లో ఎన్ని మగ్గాలు ఉన్నాయన్న నిబంధనలతో పనిలేకుండా, పారదర్శకంగా ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక ఊరటను కల్పిస్తోంది.
కేవలం నగదు బదిలీకే పరిమితం కాకుండా, చేనేత వృత్తికి గుదిబండగా మారిన నిర్వహణ వ్యయాన్ని తగ్గించేలా సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇళ్లలోని మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఇప్పటికే ఉచిత విద్యుత్‌ను సమర్థవంతంగా అందిస్తోంది. దీనివల్ల ప్రతి చేనేత కుటుంబానికి నెలకు, ఏటా వేల రూపాయల కరెంటు బిల్లులు ఆదా అవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.150 కోట్లకు పైగా అదనపు భారం పడుతున్నప్పటికీ, చేనేత రంగాన్ని బతికించుకునేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు.
నగదు సాయం, ఉచిత విద్యుత్‌తో పాటుగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చేనేత వస్త్రాలకు తగిన ప్రాచుర్యం, ఆధునిక మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ తీసుకుంటున్న ఈ వరుస నిర్ణయాలు కార్మిక లోకంలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. నూలు కొనుగోలు నుంచి ఉత్పత్తుల విక్రయం వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుండటం, ఖాతాల్లో నేరుగా రూ.25 వేలు జమ అవుతుండటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు, ఇతర చేనేత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.











