(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం ప్రజలు దేనికోసం భయపడ్డారో అది జరిగిపోయింది. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మార్ కళాశాల ఎయిడెడ్ ప్రస్థానం ముగిసిపోయింది. ఇకపై దీన్ని ప్రైవేటు సంస్థగానే పరిగణించాల్సి వస్తుంది. ఈ ఏడాది డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో మహారాజా కళాశాలలో ప్రవేశాలను పూర్తిగా నిలిపివేశారు. కళాశాల స్వయం ప్రతిపత్తిని తీసివేసినట్లు, ప్రైవేటు సంస్థగానే చూపినట్లు అధ్యాపకులు, విద్యార్థులు చెబుతున్నారు. ఆన్లైన్లో ఇక్కడి కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్‌గా చూపడంతో విద్యార్థులపై రుసుముల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రామతీర్థం ఘటన రావణకాష్టంలా రగులుతుండటంతో ఎమ్మార్ వ్యవహారాన్ని చడిచప్పుడు లేకుండా ముగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆన్లైన్లోడిగ్రీ ప్రవేశాలు
రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి పచ్చజెండా ఊపింది. ఆన్లైను రిజిస్ట్రేషన్లకు తెరతీసింది. మొన్నటి వరకు ఇంజినీరింగ్.. వృత్తివిద్యా కోర్సులకే పరిమితమైన ఆన్లైనులో సీట్ల కేటాయింపు ఇప్పుడు డిగ్రీ ప్రవేశాలకు వర్తింపజేసింది. విద్యార్థులకు నచ్చిన కోర్సుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో 81 కళాశాలలో 29,478 సీట్లు ఉన్నాయి.
ఇంటర్లో 40శాతం ఉంటేనే ..
బీఎస్సీలో చేరే విద్యార్థులు ఇంటర్లో 40 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు ఉత్తీర్ణులైతే చాలు. స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు పొందిన డిప్లమో ఇన్ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశాన్ని కల్పించారు. వీరి కోసం 5% సూపర్ న్యూమరరీ సీట్ల్లను కేటాయిస్తారు. ఇక ఇంటర్ వృత్తివిద్యలో ఎంఎల్టీ కోర్సు చేసిన విద్యార్థులు బీఏ, బీకాంలో చేరడానికి అర్హులు. ఇదే విభాగంలో బ్రిడ్జికోర్సు పూర్తిచేసిన ధ్రువపత్రాన్ని కలిగి ఉన్న వారికి బీఎస్సీలో చేరడానికి అవకాశమిచ్చారు.
సమన్వయ కమిటీలు
ఈ ఏడాది ఆన్లైను ప్రవేశాలను రాష్ట్ర, జిల్లాస్థాయిలో ప్రత్యేక సమన్వయ కమిటీల ద్వారా ఉన్నత విద్యాశాఖ పర్యవేక్షించనుంది. జిల్లాస్థాయిలో ఆర్జేడీ, ప్రభుత్వ ఆదర్శ కళాశాల ప్రధానాచార్యులు, ఏయూ డీన్ లేదా సీడీసీ, సీసీఈ నామినేట్ చేసిన ప్రైవేటు ఎయిడెడ్ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
సహాయక కేంద్రాలు
ఆన్లైను ప్రవేశాల కోసం జిల్లాలో ఎస్.కోట, సాలూరు, విజయనగరం, గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రవేశాల్లో తలెత్తే సందేహాలు, సమస్యలతో పాటు కళాశాల ప్రవేశాల కోసం వెబ్ ఎంపికలు, సీట్ల కేటాయింపులో తలెత్తే ఇబ్బందులు తదితర అంశాల పరిష్కారానికి ఈ కేంద్రాలు పనిచేస్తాయని, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు టి.రాధాకృష్ణ సూచించారు.
మొదటి దశ రిజిస్ట్రేషన్లు : జనవరి 6 నుంచి 17 వరకు
ఐచ్ఛికాల ఎంపిక (వెబ్ ఆప్షన్లు): 9 నుంచి 17 వరకు
సహాయక కేంద్రాల్లో అందే సేవలు : 6 గంటల నుంచి 12 వరకు
ప్రత్యేక విభాగాలకు ధ్రువపత్రాల పరిశీలన : 11 గంటల నుంచి 12 వరకు
(ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడలు, దివ్యాంగ కేటగిరీలు)
విద్యార్థులకు సీట్ల కేటాయింపు: జనవరి 20
ప్రవేశాలు పొందిన కళాశాలల్లో చేరిక : 21 నుంచి 23 వరకు
ఇవి తప్పనిసరి..
ఓసీ, బీసీ విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశాలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.100 ఆన్లైన్లో రుసుము చెల్లించాలి.
విద్యార్థుల ఇంటర్ హాల్‌టిక్కెట్ నంబరు తప్పనిసరిగా నమోదు చేయాలి. విద్యార్థుల ఆధార్ సంఖ్య. మీ-సేవలో నమోదు చేసిన ఆదాయ, కులధ్రువీకరణ పత్రం సంఖ్య ఉండాలి.
ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాస ధ్రువపత్రం (స్టడీ సర్టిఫికెట్).
రేషన్‌కార్డు, చరవాణి నంబర్లు.
విద్యార్థి ఈ-మెయిల్ ఐడీ.
పాస్‌పోర్టుసైజు ఫొటో, సంతకం.











