ఇంటర్వ్యూలు లేకుండా రాత పరీక్షలతోనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 సహా అన్ని పరీక్షల ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలతోనే నియామకాలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇంటర్వ్యూలు లేకుండా ఎంపికలు ఎలా చేస్తారని అభ్యర్థులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇంతవరకూ ఏపీ ప్రభుత్వం ప్రకటించలేదు.
నిలిచిన గ్రూప్-1 ఇంటర్వ్యూలు..
ఇప్పటికే గతంలో ఎపీపీఎస్సీ ప్రకటించిన నోటిఫికేషన్‌కు సంబంధించిన గ్రూప్ -1 ఇంటర్వ్యూలు హైకోర్టు ఆదేశంతో వాయిదా పడ్డాయి. గతంలో నిర్వహించిన పరీక్షల పత్రాలను వాల్యూయేషన్‌కు ఇతర రాష్ట్రాలకు పంపారని,ఇది చట్ట విరుద్ధమంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేగాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడ ఈ వాల్యూయేషన్ విధానం సరికాదని పేర్కొంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంగ్లీష్ మీడియం పేపర్లను వాల్యూషన్ కోసం ఇతర రాష్ట్రాలకు పంపడంతో కొందరు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అయన పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం ఇంటర్వ్యూలకు ఉపక్రమించడంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇంటర్వ్యూలను నెల రోజుల పాటు వాయిదా వేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగ నియామకాలు చేపడతామంటూ ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేయటం విశేషం.ఇంటర్వ్యూల స్థాయిలో ఆగిన ఆ నియామకాలు ఏమవుతాయనే గందరగోళం నెలకొంది.
28న ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి
కాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలెండరా లేక జాబ్ లెస్ క్యాలెండరా అని విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు ప్రశ్నించారు. ఈ నెల 18న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో 36 ఉద్యోగాలను మాత్రమే రిలీజ్ చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1, 2, 3లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని హోంమంత్రి ప్రకటించి జాబ్ లెస్ క్యాలెండర్‌ను విడుదల చేశారని, అన్ని ఖాళీల వివరాలతో మరల క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ఉచిత పథకాలతో కాలయాపన చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 28వ తేదీన ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు హెచ్చరించారు.
Must Read ;- జగనన్నా 2.30 లక్షల ఉద్యోగాలెక్కడ?











