ఎన్నికల సమయంలో 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన జగన్ మాట తప్పారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసిన జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాపం కుంభకోణం తరహాలోనే జగన్ రెడ్డి పాలనలో గ్రూప్-1 కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సీఎం జగన్ ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, వేలాది మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు అనే నినాదంతో పోరాటం చేస్తామని, నిరుద్యోగులంతా కలిసి రావాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
న్యాయ పోరాటానికి సిద్ధం
గ్రూప్-1 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపి నిజాలను తేల్చాలని డిమాండ్ చేశారు. గ్రూప్ అభ్యర్థుల తరపున చర్చించిన తర్వాతే న్యాయపోరాటానికి సిద్ధమయ్యామని అన్నారు. దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసు అని, ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, మార్కులను వెల్లడించాలని లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని, లేకపోతే ప్రభుత్వ విధానాలను ఎండగడుతామని హెచ్చరించారు. కోర్టు మొట్టికాయలు వేసినా జగన్ రెడ్డిలో మార్పురాలేదని అన్నారు.
యువతకు అండాదండా
ఎన్నికల ముందు జాబు రెడ్డిగా ప్రకటించుకున్న జగన్ డాబు రెడ్డిగా మారారని విమర్శించారు. పరిపాలనలో కీలకంగా వ్యవహరించే గ్రూప్ 1, 2 కు కేవలం 36 పోస్టులే ప్రకటించి రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ పోరాడుతానని నారా లోకేశ్ హెచ్చరించారు. ఈ విషయంలో నిరుద్యోగులకు అండగా నిలుస్తామని లోకేశ్ ప్రకటించారు. జగన్ సర్కారు తీరుతో ఏ ఒక్కరూ అధైర్యపడాల్సిన పనిలేదని, అన్యాయానికి గురయ్యే ప్రతి ఒక్కరికీ టీడీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Must Read ;- ఏపీపీఎస్సీని అవినీతి మయం చేశారు : నారా లోకేష్











