ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అవినీతి మయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. గ్రూప్ వన్‌లో క్వాలిఫై అయిన అభ్యర్ధులతో ఇవాళ ఆయన బూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. గ్రూప్ వన్‌లో 9,678 మంది అభ్యర్థులు క్వాలిఫై అయితే కేవలం 340 మందిని మాత్రమే ఇంటర్వ్యూలకు పిలవడం ఏంటని లోకేష్ ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని ఈ సమావేశంలో పలువురు అభ్యర్థులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.ఏపీపీఎస్సీలో వైసీపీ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని లోకేష్ ఆరోపించారు.మద్యం,ఇసుక,గ్రూప్ వన్ అవినీతికి ఏదీ కాదు అనర్హం అన్న విధంగా ఏపీలో పాలన తయారైందని ఆయన ఎద్దేవా చేశారు. కనీస విద్యార్హత లేని వారిని కూడా ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించారని లోకేష్ తెలిపారు.
కేసులు పెట్టిన వారినే..
టీడీపీ నేతలను వేధించి, కేసులు పెట్టిన వారిని ఏపీపీఎస్సీలో సభ్యులుగా నియమించారని నారా లోకేష్ గుర్తు చేశారు. ఏపీపీఎస్సీని వైసీపీ పబ్లిక్ కమిషన్‌గా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడటంతో పాటు, డిజిటల్ మూల్యాంకనంలో కూడా అవకతవకలకు పాల్పడ్డారని లోకేష్ ఆరోపించారు.ఇంటర్వ్యూలకు పిలిచిన అభ్యర్థుల పేర్లు, మార్కులు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.
MustRead ;- పరిశ్రమ చంద్రబాబుది.. ప్రచారం జగన్‌ది: నారా లోకేష్











