ప్రభాస్ లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీసే. కానీ ఒక్క సినిమా మాత్రం వెరీ వెరీ స్పెషల్. అదే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. సైన్స్-ఫిక్షన్ లోనే సరికొత్త ప్రయోగం. తాజా సమాచారం ప్రకారం.. భూమి అడుగున ఉన్న ఓ కొత్త లోకంలో ఈ సినిమా కథ నడుస్తుందంట. ఆర్టిస్టుల మేకప్పులు, గెటప్పులతో పాటు వాళ్లు వాడే వాహనాలు, నివశించే ఇల్లు, వాడే వస్తువులు అన్నీ కొత్తగా ఉంటాయట. అందుకే దీని కోసం ఇంజనీర్లు కావాలంటూ నోటిఫికేషన్ ఇచ్చారు.
తమ సినిమా కోసం మెకానికల్, ఆటోమొబైల్, రోబోటిక్ ఇంజనీర్లను తీసుకోనున్నారు. మాతో పని చేసేందుకు ఇంజనీర్లు కావాలి అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ టీం, నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అడుగుతోంది. సోషల్ మీడియా ద్వారా ఇంజనీర్లకి ఆహ్వానం పలికింది. ఇంటీరియర్ డిజైనర్లు, సివిల్ ఇంజినీర్లు, యావియేషన్ ఇంజనీర్లు.. ఇలా రకరకాల విభాగాలకు చెందిన వాళ్లు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు.
ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీని రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ సినిమాని గతేడాదే స్టార్ట్ చేస్తారని భావిస్తే అది ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యేలా ఉంది. సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా దీపికా పదుకొన్, ఓ కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాను తీసిన సింగీతం శ్రీనివాసరావు సేవల్ని ఈ సినిమా కోసం వాడుకోబోతున్నారు.
మూవీకి సంబంధించి ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ అయింది. ప్రభాస్ పై ఫొటో షూట్ కూడా పూర్తయింది. ఆ లుక్ లేదా టైటిల్ ను గతంలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో, షూటింగ్ ఇంకాస్త లేట్ అవుతుండడంలో టైటిల్ ను ఎనౌన్స్ చేయకుండా దాచేశారు. సినిమా ఎప్పుడు సెట్స్ పైకొస్తే, అప్పుడు వెంటనే టైటిల్ ఎనౌన్స్ చేస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్. మరో వారం రోజుల్లో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ వెంటనే సలార్, ఆదిపురుష్ షూటింగ్స్ ను కంటిన్యూ చేస్తాడు. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి పూర్తయినా, వెంటనే నాగ్ అశ్విన్ సినిమా పట్టాలపైకి వస్తుంది. ఈలోగా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసి సిద్ధంగా ఉంటాడు నాగ్ అశ్విన్.











