కృష్ణా నది నీటి వినియోగంలో ఏపీపై ప్రస్తుతం తెలంగాణ మంత్రులు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలను ఒక రాజకీయ డ్రామాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసేందుకే ఈ రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని అరుణ విమర్శించారు. సీఎం కేసిఆర్ రానున్న ఎన్నికల్లో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి, ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా నాటకాలు అడుతున్నారని అరుణ విమర్శించారు. కృష్ణా నది జలాల విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నామో ఆలోచించి ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని అరుణ వ్యాఖ్యానించారు. పాలమూరు – రంగారెడ్డితో పాటు రాష్ట్రంలో చేపట్టనున్న ఏ ప్రాజెక్టుపైనా సీఎం కేసిఆర్‌కు చిత్తశుద్ది లేదని ఆమె విమర్శించారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే..
హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రతిపక్ష నాయకులకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ప్రతిపక్షనాయకులు ఇచ్చిన ఎన్ని సలహాలు పాటించారని ఆమె ప్రశ్నించారు. ఏనాడు ఆయన ప్రతిపక్షాలకు విలువ ఇవ్వలేదని అన్నారు. వచ్చే హుజురాబాద్ ఎన్నికల కోసం ఆయన మరో నాటకం ఆడుతున్నారని, ఆ ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ వారి ముఖం చూడబోరని ఆమె అన్నారు.
Must Read ;- మళ్లీ ‘జల్’ హల్ చెల్.. అవి పొలిటికల్ వివాదాలేనా!











