(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
జాబ్ లెస్ క్యాలెండర్‌తో నిరుద్యోగులను మోసగించారంటూ APTNSF, AISF, AIYF అఖిల పక్షం ఆధ్వర్యంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదని ఏపీటీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. ప్రణవ్ గోపాల్ అన్నారు. జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేసి, నిరుద్యోగుల ఆశలకు శఠగోపం పెట్టిన అబద్దాల ముఖ్యమంత్రిగా జగన్ మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పదివేల ఉద్యోగాలతో రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం ఏవిధంగా తీసుకుని వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా ఉన్న జీవో ఎంఎస్ నెంబర్ 39ని తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నిలువునా మోసం
AISF రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా కొత్త ఉద్యోగాలుగా చూపించడం ప్రజల చెవిలో పువ్వులు పెట్టడమే అని అభివర్ణించారు. జాబ్ లెస్ క్యాలెండర్‌ను తక్షణమే రద్దు చేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 13 వేల పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి యువజన జె.ఎ.సి రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్ రాజన్ , AIYF నాయకులు లెనిన్, టిఎన్ఎస్ఎఫ్ విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్షుడు యస్ .రతన్ కాంత్, ప్రధాన కార్యదర్శి జోష్ యాదవ్ , AISF జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- పాదయాత్రలో జగన్ హామీల జాతర.. అన్నింటికి పాతర!