Hero Nani About Timmarusu Movie:
సత్యదేవ్ కథానాయకుడిగా ‘తిమ్మరుసు’ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాతో శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుండటంతో, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ .. “సత్యదేవ్ నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన ఎంత మంచి నటుడో .. అంత మంచి మనిషి. ఆయనను చూడగానే నాకు ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది. సత్య ఎంత గొప్ప నటుడో అని చెప్పడానికి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఒక్కటి సరిపోతుంది.
ఆ సినిమా థియేటర్లకు వచ్చి ఉంటే .. ఈ పాటికే స్టార్ గా సత్య జర్నీ స్టార్ట్ అయ్యుండేది. ఆ జర్నీ ‘తిమ్మరుసు’తో మొదలవుతుందనే అనుకుంటున్నాను. ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లకు వస్తోంది. ఇక్కడి ప్రేక్షకులకు ప్రధానమైన వినోదసాధనం సినిమానే. అందుకే వాళ్లకు థియేటర్లతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కరోనా అనగానే అన్నిటికంటే ముందుగా థియేటర్లు మూసేస్తారు .. అన్నిటికంటే చివరన తెరుస్తారు. అన్నిటితో పాటే తెరవచ్చుగదా అనేది ఒక సాధారణ ప్రేక్షకుడిగా నాకు అనిపిస్తూ ఉంటుంది. క్లబ్బులు .. రెస్టారెంతో పోలిస్తే, థియేటర్లు చాలావరకూ నయమేకదా.
ఇక ఈ ఏడాది థర్డ్ వేవ్ అనేది రాకుండా .. ‘తిమ్మరుసు’తో మొదలుపెట్టి, అన్ని సినిమాలు వరుసగా థియేటర్లకు రావాలని కోరుకుంటున్నాను. మునుపటిలా అంతా థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రాబోయే సినిమాలన్నింటికీ ‘తిమ్మరుసు’ అనేది ఒక ఆక్సిజన్ ను ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది” అంటూ ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు అందజేశాడు.