టాలీవుడ్ లో బెస్ట్ పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్. జయా పజయాలతో సంబంధం లేకుండానే.. అతడి ప్రతిభకు పట్టంగడుతూ ఉంటారు టాలీవుడ్ ప్రేక్షకులు. ‘బ్లఫ్ మాస్టర్, 47 డేస్’ లాంటివన్నీ అతడి అత్యుత్తమ నటనా ప్రదర్శనకి నిదర్శనాలుగా నిలిచిపోయిన సినిమాలు. వాటికి తోడు.. మొన్నా మధ్య ఓటీటీలో విడుదలైన ‘ఉమా మహేశ్వరా ఉగ్రరూపస్య’ సినిమా సత్యదేవ్ కెరీర్ బెస్ట్ మూవీ అయింది. అందులోని అతని నటనకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.
ఆ ఒక్క సినిమా సక్సెస్ క్రెడిట్ తో సత్యదేవ్ కి ప్రస్తుతం వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అందులో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఒకటి. నాగ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ‘లవ్ మాక్ టైల్’ కన్నడ మూవీకి రీమేక్ వెర్షన్. ఇందులో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది.ఈ రేర్ కాంబినేషన్ వల్లనే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కొద్ది రోజుల క్రితమే లాంఛ్ అయింది ఈ మూవీ. అయితే ఈ సినిమా నుంచి సత్యదేవ్ తన పారితోషికాన్ని ఓ రేంజ్ లో పెంచేశాడని వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం సత్యదేవ్ రూ. 1.2కోట్లు పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. గత చిత్రాలకోసం సత్యదేవ్ కేవలం రూ. 40లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ అందుకొనేవాడు. ఎప్పుడైతే ‘ఉమా మహేశ్వరా ఉగ్రరూపస్య’ సినిమా బిగ్గెస్ట్ హిట్టయిందో.. అప్పటి నుంచి సత్యదేవ్.. తన పారితోషికాన్ని కూడా పెంచేశాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి గుర్తుందా శీతాకాలం సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయితే… అతగాడి పారితోషికం ఇంకెంతగా పెరుగుతుందో చూడాలి.











