300 Crores For Resigning ZPTC Post :
వినడానికి కాస్తంత ఇబ్బందిగానే ఉన్నా.. స్వయంగా జడ్పీటీసీగా కొనసాగుతున్న నేతే.. తాను పదవికి రాజీనామా చేయాలంటే రూ.300 కోట్లు ఇవ్వాలంటూ బహిరంగంగానే చెబుతుంటే.. ఇబ్బందికరంగా ఉన్నా విని తీరాల్సిందే కదా. ఏంటేంటీ.. జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయాలంటే.. రూ.300 కోట్లు ఇవ్వాలా? ఆ మొత్తంతో కనీసం ఓ ఐదు అసెంబ్లీ సీట్లు అయినా గెలవొచ్చు కదా అంటారా? అలాగైతే ఎమ్మెల్యే సీట్లే గెలుచుకోండి. జడ్పీటీసీగా ఉన్న నేతను లాగేసుకునే యత్నం చేయడం ఎందుకు? అన్న ప్రశ్నలు ముఖంపై కాస్తంత గట్టిగానే తగులుతున్నాయి. మొత్తంగా నేతలను, వారి అనుభవిస్తున్న పదవులను కొనడం అంత ఈజీ కాదన్న విషయాన్ని చెప్పేందుకే కాబోలు.. ఈ జడ్పీటీసీ గారు ఇలా తన పదవి రేటును అమాంతంగా పెంచేశారేమోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్లిపోదాం పదండి.
అంతా హుజూరాబాద్ చుట్టూనే..
హుజూరాబాద్ అసెంబ్లీకి ఎప్పుడు ఉప ఎన్నిక జరుగుతుందో తెలియదు గానీ.. ఇప్పటి నుంచే అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా తమదైన శైలి యత్నాలు చేస్తున్నాయి. ఒక పార్టీని మించి మరో పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూకుడు పెంచుతున్నాయి. ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉంటూ ఇతర పార్టీల్లో ఏదేనీ పదవిలో ఉన్న నేత కనబడితే చాలు.. అన్ని పార్టీలు సదరు నేతలను లాగేసేందుకు యత్నిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఆయా నేతలు.. తమ పదవులకు రాజీనామాలు చేసి.. ఇతర పార్టీల్లో చేరాలంటే.. తమకో, తమ ప్రాంతానికో ఇంత రేటు అని ప్రకటించేస్తున్న వైనం ఆసక్తి రేపుతోంది. అసలే హోరాహోరీగా సాగనున్న హుజూరాబాద్ బైపోల్ లో పై చేయి సాధించేందుకు దాదాపుగా అన్ని పార్టీలు తమదైన శైలి వ్యూహాలు రచిస్తున్న వైనం తెలిసిందే. ఈ వ్యూహాలకు దీటుగా ఇప్పుడు ఆయా పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు.. తమ పదవులకు రేట్లను ప్రకటిస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
రూ.300 కోట్లు ఎందుకో తెలుసా?
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మోహన్‌రెడ్డి జడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలోని రెవెన్యూ డివిజనే కదా. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అప్పటిదాకా రెవెన్యూ డివిజన్ గా ఉన్న కామారెడ్డి ఏకంగా జిల్లాగా రూపొందగా.. అందులో ఓ గ్రామంగా కొనసాగిన రామారెడ్డి కూడా మండల హోదాను సంతరించుకుంది. ఆ మండలానికి జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. హుజూరాబాద్ ఎన్నికల వేడి పొరుగు జిల్లాకు కూడా తాకుతుంది కదా. ఈ నేపథ్యంలో మోహన్ రెడ్డి ఓ వింత ప్రకటన చేశారు. తనను జడ్పీటీసీకి రాజీనామా చేయమంటున్నారని, అయితే అందుకు తనకేమీ ఇబ్బంది లేదని.. తన మండలంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.300 కోట్లు ఇస్తే తాను ఎంచక్కా జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా.. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికలో తాను అసలు పోటీకి కూడా దిగనని కూడా ఆయన ప్రకటించారు. ఏ ఉద్దేశ్యంతో చేశారో, ఏమో గానీ.. ప్రస్తుత రాజకీయ పార్టీల స్థితిగతులను సూటిగా చెప్పేలా మోహన్ రెడ్డి చేసిన ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
Must Read ;- గులాబీకి ప్లస్!.. బీజేపీ, కాంగ్రెస్ లకు మైనస్!