ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీకి రాష్ట్ర అసెంబ్లీలో నిజంగానే గట్టి బలమే ఉంది. మొత్తం సభ్యుల సంఖ్య 175 ఉంటే.. వైసీపీ తరఫున గెలిచిన వారే 151 మంది ఉన్నారు. ఇక జనసేన తరఫున గెలిచిన ఓ ఎమ్మెల్యే, టీడీపీ తరఫున గెలిచిన 23 మందిలో ఓ నలుగురు వైసీపీ పక్షం వైపే మారిపోయారు. మొత్తంగా తన సొంత బలానికి అదనంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకున్న జగన్.. తమకు తిరుగులేని బలం ఉందని ఒకింత గట్టిగానే చెబుతున్నారు. బలం పెరిగితే మంచిదే గానీ.. అదే బలం పెరిగి విరిగితే బలహీనుడి కంటే కూడా దుర్బమయ్యే పరిస్థితిని తెచ్చుకున్నట్టవుతుంది. ఈ తరహా పరిణామాలు జగన్ కు ఇంకా అనుభవంలోకి రాకపోయి ఉండవచ్చు గానీ.. తమ పార్టీకి తిరుగులేని బలం ఉందన్న భావన ఎమ్మెల్యేల్లోనూ వస్తే.. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏకంగా రెండు నియోజకవర్గాల్లో.. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేల కారణంగా.. వారి నియోజకవర్గాల్లో రచ్చరచ్చ సాగుతోంది. ఈ పరిస్థితికి జగన్ కు ప్రత్యక్ష సంబందం ఏమీ లేకున్నా.. తిరుగు లేని బలం ఉందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టిప్పుతో రాచమల్లు అగ్గి రాజేశారు
జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట కిందే లెక్క. ఇక్కడ మొన్న కూడా వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వివాదాలు అంటేనే అల్లంత దూరాన ఉండే రాచమల్లు.. ఇప్పుడు తానే ఓ పెను వివాదాన్ని రేపారు. ప్రొద్దటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన రాచమల్లు.. త్వరలోనే అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. శంకుస్థాపన సందర్బంగా జనం ముందు మైకు అందుకున్న రామచల్లు ఓ రేంజిలో మాట్లాడారు. టిప్పును ఏకంగా దేశ భక్తుడు అంటూ వీరాది వీర యోధుడు అని తనదైన శైలిలో పొగిడేశారు. టిప్పు సుల్తాన్ విశ్వసనీయతపై అప్పుడెప్పుడె బెంగళూరు రావణ కాష్టంలా తగలబడిపోయిన వైనం రామచమల్లుకు గుర్తు లేదేమో. అందుకే తనదైన శైలిలో టిప్పును కీర్తించారు. ఈ వ్యాఖ్యలు చెవినపడినంతనే బీజేపీ శ్రేణులు రాచమల్లుపైకి దండెత్తాయి. అయినా కూడా వెనక్కు తగ్గని రాచమల్లు తనదైన శైలిలో తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. అంతేకాకుండా బీజేపీపైకి ఎదురు దాడికి దిగుతున్నారు. ప్రొద్దటూరులో టిప్పు విగ్రహ ఏర్పాటు ప్రభుత్వ సంకల్పమేనన్న కలరింగ్ ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఎప్పుడో అప్పుడు జగన్ సమాధానం చెప్పుకోక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గోవధను నిషేధించాలట
ఈ వివాదం అలా కొనసాగుతుండగానే.. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరో వివాదాన్ని రాజేశారు. బీజేపీ నేతలు తీవ్రాతితీవ్రంగా వ్యతిరేకిస్తున్న గోవధపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడో పురాతన కాలంలో రూపొందిన గోవధ నిషేధ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన తనదైన స్టైల్లో రూలింగ్ ఇచ్చేశారు. ఈ వ్యాఖ్యలు చెవినపడిన బీజేపీ నేతలు ఊరుకోరు కదా. తమ పార్టీని ఏమన్నా పెద్దగా పట్టించుకోనట్లే కనిపించే బీజేపీ నేతలు.. హిందూ మతాన్ని కించపరిచేలా ఎవరు వ్యాఖ్యానించినా.. ఊరికే ఉండరు. ఎగబడతారు. తిరగబడతారు. ప్రముఖులైతే ఇళ్లను ముట్టడిస్తారు.ఇప్పుడు ఎమ్మిగనూరులోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. గోవధ నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసిన ఎర్రకోట.. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు.. అప్పటిదాకా ఎర్రకోటను బయట తిరగనివ్వబోమని తెగేసి చెప్పారు. అయితే రామచల్లు మాదిరే ఎర్రకోట కూడా ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఈ వ్యవహారంపైనా జగన్ ఎప్పుడో అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి రాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కేసీఆర్ ప్రాణం పోస్తుంటే.. జగన్ భరోసా ఇవ్వలేకున్నారే











