కర్నూలు జిల్లాలో వైసీపీ మరో ఎదురుదెబ్బ తగాలబోతోందా ? యూత్ లో మాస ఫాలోయింగ్ ఉన్న నాయకుడు పార్టీని వీడబోతున్నాడా ? అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలో చేరాలని ఆ యువనాయకుడు నిర్ణయించుకున్నాడా ? అందుకే నాలుగు నెలలుగా మౌనంగా ఉంటున్నాడా ? స్థానిక ఎమ్మెల్యేతో ఉన్న విభేధాలే ఆయనను పార్టీ వీడేలా చేస్తున్నాయా ? ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం, పార్టీ మారబోతున్న ఆ యువనేత ఎవరు ?
కర్నూలు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగాలబోతోందనే చర్చ జోరందుకుంది.శాప్ ఛైర్మన్, నందికొట్కూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి పార్టీని వీడబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్ధర్ కి, సిద్ధార్ధ రెడ్డికి మధ్య ఉన్న విబేధాలు ఇందుకు కారణం అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో సిద్ధార్ధ రెడ్డి మనస్తాపం చెందారని, ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని టాక్.
నిజానికి నందికొట్కూర్ నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్ధ చాలా యాక్టివ్. ఇక 2019 ఎన్నికల్లో అక్కడ వైసీపీ విజయంలోనూ ఆయన పాత్ర చాలా కీలకమని ఆ పార్టీ నేతలె చెప్పుకుంటారు. అలాంటి సిద్ధార్ధ రెడ్డి నాలుగు నెలలుగా సైలెంట్ గా ఉండిపోవడం పై పార్టీలో పెద్ద చర్చే జరుగుతోందట. ఇక వైసీపీ హై కమాండ్ సైతం సిద్ధార్ధ రెడ్డి మౌనానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడిందని వినికిడి.
వాస్తవానికి కర్నూలు జిల్లా రాజకీయాల్లో వర్గపోరు ఎక్కువనే చెప్పుకోవాలి. అందులోనూ నందికొట్కూర్ లో ఎమ్మెల్యే ఆర్ధర్, శాప్ ఛైర్మన్ సిద్ధారధ రెడ్డిల మధ్య విబేధాలు తారా స్థాయిలో ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ చూరుగ్గానే పాల్గొనేవారట. కాగా తాజాగా మిడుతూరు మండలం నాగులూటీలో కొన్ని అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆర్ధర్ లేకుండానే మంత్రితో కలిసి సిద్ధార్ధ రెడ్డి ప్రారంభించారట. ఈ అంశంలో చెలరేగిన వివాదం పెను దుమారమే లేపిందట. ఎమ్మెల్యే లేకుండా సిద్ధార్ధ రెడ్డి ప్రారంభోత్సవాలు చేయడాన్ని ఎమ్మెల్యే ఆర్ధర్ జీర్ణించుకోలేకపోయారట. ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెల్లగా పెద్ద పంచాయితీనే జరిగిందట. అయితే ఈ అంశం తర్వాత సిద్ధార్ధ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో , ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన అంటీ ముట్టనట్లు ఉంటున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లోనే నెలకొందట.
అధిష్టానం నుంచి ఊహించని పరిణామాన్ని చవిచూసిన సిద్ధార్ధ రెడ్డి పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగానే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో ఆయన భేటీ అయ్యారనే ప్రచారం రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఇరువురి మధ్య జరిగిన చర్చల్లో శ్రీశైలం, నందికొట్కూర్ లతో పాటు పాణ్యం నియోజకవర్గాల బాధ్యత తాను చూసుకుంటానని సిద్ధార్ధ రెడ్డి ,లోకేష్ కి చెప్పారని.. దానికి లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే డిస్కషన్ హాట్ హాట్ గా జరుగుతోంది. దీంతో నందికొట్కూర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో చెరతారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సిద్ధార్ధ రెడ్డి వర్గం కొట్టిపారేస్తోంది. తమ నాయకుడిపై ఉన్న అక్కసుతో ఆయన వ్యతిరేక వర్గం కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తోందని చెబుతోంది. ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే ఎవరికీ భయపడే వ్యక్తి తమ నాయకుడు కాదని, ఏదైనా బహిరంగంగా చెబుతారని అంటున్నారు.
మరి పొలిటికల్ వేడిని పెంచేస్తున్న, కర్నూలు రాజకీయాల్లో కలకలం రేపుతున్న సిద్ధార్ధ రెడ్డి అంశంలో ఏం జరగబోతోందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.