కోనసీమ ఎందుకు తగలబడింది ? కులాల మధ్య చిచ్చు ఎవరికి లాభం ? అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణల్లో నిజమేంటి ? జగన్, పీకే 2.0 గానే అమలాపురంలో అల్లర్లు చెలరేగాయా ? అసలు ఈ ఉదంతంలో పోలీసులు పోషించిన పాత్రపై వస్తున్న అనుమానాలు, వెల్లువెత్తుతున్న విమర్శలు ఏమిటి ?
పచ్చతోరణంలా కనిపించే కోనసీమ తగలబడింది. అమలాపురంలో నెలకొన్న అల్లర్లతో ఆ ప్రాంతంలో రావణ కాష్టం రాజుకున్నట్టయ్యింది. అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా..ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై ఎన్నో విమర్శలు, మరెన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కోనసీమలో జరిగిన హింసాకాండ రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేపింది. ఈ విధ్వంశకాండ వెనుక అధికార వైసీపీ కుట్ర దాగుందనే చర్చ జోరుగా సాగుతోంది. కులాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలో భాగంగా.. జగన్, పీకే డైరక్షన్ లోనే ఈ అల్లర్లు చెలరేగాయని టాక్.
ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరుస పర్యటనలు చేస్తూ రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అని సిగ్నల్స్ కూడా ఇచ్చేశారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఆయన చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సెగలు రేపింది. అదే సమయంలో ఇంతకాలం పవన్ కు కాస్తంత దూరంగా ఉన్న కాపు నేతలు, ఆ సామాజికవర్గ ప్రజలు ఇప్పుడు మళ్ళీ పవన్ వైపు చూడడం మొదలు పెట్టారు.ఇదే పరిస్థితి కొనసాగితే కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం జనసేన వైపు మరలిపోయే ప్రమాదం ఉందనే భయం జగన్ లో మొదలయ్యిందట.
ఇక జగన్ పాలనలో దళితులు దగాపడుతున్నారనే భావన ఆ వర్గంలోని మెజారిటీ ప్రజల్లో నెలకొంది. ఇటీవల దళితులపై వైసీపీ నాయకులు వరుస దాడులు, తాజాగా ఎమ్మెల్సీ అనంత బాబు తన డ్రైవరు సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఘటన.. ఈ వరుస పరిణామాలతో దళితులు తమకు దూరమవుతున్నారని పసిగట్టిన జగన్ ఈ కుట్రకు తెరలేపారనేది కొందరి వాదన. ఈ క్రమంలో ప్రజల దృష్టి మరలాలన్నా, దళితులు తిరిగి జగన్ పార్టీ వైపు చూడాలన్నా ఏదో ఒక పెద్ద సంఘటన జరగాలనే పీకే ఆలోచనకు ప్రతీరూపంగానే అమలాపురంలో అల్లర్లు జరిగాయనే చర్చ జోరందుకుంది.అందులో భాగంగానే కాపులకు, దళితులకు మధ్య చిచ్చు రాజేసి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే భారీ కుట్రకు జగన్ తెర లేపారని టాక్. అందుకే కోనసీమ జిల్లాకు రాత్రికి రాత్రి చడీ చప్పుడు కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారని.. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జగన్ సర్కార్ కనుసన్నల్లో జరిగిన కుట్రే అని కొందరు చర్చించుకుంటున్నారు.
కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు,కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పెట్టే సమయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్న జగన్ అంబేద్కర్ విషయంలో రెండోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఏం వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.జిల్లాల పునర్విభజన సమయంలోనే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఎటువంటి సమస్య ఉత్పన్నమయ్యి ఉండేది కాదు. అలాకాకుండా మొదట కోనసీమ జిల్లాగా పేరు పెట్టి తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం కేవలం కుట్రపూరిత చర్యే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి కోనసీమ ప్రత్యేక జిల్లా కావాలనే డిమాండ్ సుమారు నాలుగు దశాబ్దాలుగా ఉంది.ఇదే విషయాన్ని జిల్లాల పునర్విభజన సమయంలో అనేక మంది నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారట.అయితే కోనసీమ పేరును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ పేరును జిల్లాకు పెట్టాలని అనేకమంది కొరినప్పటికీ తొలత జగన్ నో చెప్పేశారట. అయితే తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారంతో ఆయా వర్గాల్లో తన గ్రాఫ్ మరింత పడిపోతోందని గమనించిన జగన్.. పీకేను ఆశ్రయించారట. ఈ క్రమంలో పీకే డైరక్షన్ లోనే జగన్ దావోస్ కి వెళ్ళే ముందు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లో కలెక్టర్ కు వినతులు అందజేయాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారట.
ఇదిలా ఉంటే అమలాపురం అల్లర్లు కూడా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కావాలని అల్లర్లు సృష్టించి వాటిని ప్రతిపక్షాల పైకి నెట్టేస్తే ప్రజల్లో మళ్ళీ తన గ్రాఫ్ పేరుగుతుందనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోందట. అందులో భాగంగానే తమ పార్టీ నాయకులతోనే జగన్ ఈ హింసాకాండకు ప్రేరేపించారని, ఆందోళనల పేరుతో విధ్వంసాన్ని సృష్టించింది కూడా వైసీపీ నేతలె అనేది తేటతెల్లం అయ్యింది. ముఖ్యంగా ఈ హింసకు ప్రధాన కారకుడుగా కనిపిస్తున్న అన్యం సాయి స్వయానా వైసీపీ నేత. అయితే ఈ ఘటన జరగగానే తొలత ఈ అంశాన్ని జనసేనకు పులిమే ప్రయత్నం చేసింది వైసీపీ.హోంమంత్రి తానేటి వనిత సైతం ఈ ఘటన వెనుక టిడిపి, జనసేన ప్రమేయం ఉందని ప్రకటన చేయడంతో ఈ ఉదంతం మరింత అగ్గి రాజేసింది.
అయితే, అల్లర్లకు కారణమైన సాయి జనసేన నేత అని, అతని కనుసన్నల్లోనే ఈ అల్లర్లు చెలరేగాయని వైసీపీ చేసిన ప్రచారం తిరగబడింది. అన్యం సాయి ప్రభుత్వ సలహాదారు సజ్జలతో దిగిన ఫోటోలు, జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఫోటోలు బయటకు రావడంతో వైసీపీ కుట్ర బాగణమయినట్లు అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులుగా అమలాపురంలో 30, 144 సెక్షన్ లు అమలులో ఉన్నా, సుమారు 500 మంది పోలీసు బలగాలు జిల్లా అంతటా మోహరించి ఉన్నా ఇంతమంది ఆందోళనకారులు ఎలా వచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతిపక్షాలు చిన్నపాటి ధర్నాలు, నిరసనలకు పిలుపునిస్తేనే ముందు రోజు నుంచి హౌస్ అరెస్ట్ లు చేసే పోలీసులు.. జెఎసి ముందుగా పిలుపునిచ్చినా ఎందుకు కట్టడి చేయలేకపోవడం నిఘా వైఫల్యమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేసమయంలో దీని వెనుక పోలీసుల సహకారం కూడా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. పోలీసుల సహకారం లేకుండా వేలాదిమందిగా ఆందోళన కారులు ఎలా రాగలిగారు అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే పోలీసుల తీరుపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి, పోలీసుల లాఠీ చార్జ్, గాల్లోకి జరిపిన కాల్పులు కూడా కేవలం కవ్వింపు చార్యలుగానే ఉన్నాయని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ సూచనల మేరకు పోలీసుల సహకారంతోనే అమలాపురంలో అల్లర్లు జరిగాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంమీద అమలాపురం అల్లర్ల వెనుక జగన్ కుట్ర కోణం దాగుందని, కాపులు, శెట్టిబాలిజలు, దళితుల మధ్య ఒక సున్నితమైన అంశంలో అగ్గిరాజేసి దానిని ప్రతిపక్షాల మీదకు నెట్టేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలని ఇలాంటి చర్యలకు పూనుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఘటనలో కుట్ర కోణం ప్రజలకు అర్ధమయ్యిందని.. ఈ క్రమంలో జగన్ ప్లాన్ తిరగబడిందనే వాదన వినిపిస్తోంది.











