టిడిపి శ్రేణులు ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పసుపు పండుగ మహానాడు. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోంది. ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తూ మహానాడు అడ్డుకోవాలని చూస్తోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ తీరుపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపిని ఇబ్బంది పెట్టి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారని విమర్శించారు. మహానాడుకు ఫ్లెక్సీలు పెట్టనివ్వరా… బస్సులు ఇవ్వనివ్వరా? మీ అబ్బ సొత్తా? అంటూ అధికారులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
జగన్ ఒక చిల్లర సీఎం అని…ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్న ప్రతీ ఒక్కరి తోకలు త్వరలోనే కట్ చేస్తామని హెచ్చరించారు. వైసీపీ ఆపితే మహానాడు ఆగుతుందా? అని ప్రశ్నించిన ఆయన, ప్రజల అభీష్టం మేరకు ప్రజా సమక్షంలో మహానాడు ప్రభంజనంలా జరగబోతుందని తెలిపారు.ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్ని ఆగడాలను గుర్తు పెట్టుకుంటున్నామని…రాబోయే రోజుల్లో చక్ర వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
ఏపీలో జగన్ పాలనతో ఏ వర్గం.. ఏ కులం బాలేదని..రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని బాబు తెలిపారు. గడప గడపకు వైసీపీ కాస్తా ఇప్పుడు బస్సు యాత్ర అయ్యిందని… రేపు గాలిలో వస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం అంటున్న వైసీపీ నలుగురు రెడ్లకు రాజ్యసభ ఇచ్చిందన్నా చంద్రబాబు.. 9 రాజ్యసభ సీట్లలో జగన్ ఉత్తరంద్ర, రాయలసీమ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు ఇచ్చిన 20 కార్యక్రమాలు జగన్ సర్కార్ రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. బస్సు యాత్రకు వస్తున్న మంత్రులను ప్రజలు నిలదీయాలని బాబు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ అనంత బాబు స్వయంగా డ్రైవర్‌ను చంపి డెడ్ బాడీని ఇంటికి తెచ్చి పడేశారని… సుబ్రహ్మణ్యం భార్య ప్రలోభాలకు తలొగ్గ లేదన్నారు.+ టీడీపీ, దళిత సంఘాల పోరాటం వల్లనే అనంత బాబు అరెస్ట్ అయ్యారన్నారు. కోనసీమలో ఘర్షణలు ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. రేపో, ఎల్లుండో మధ్యంతరం అని జగన్ అంటున్నారని, ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలా ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన శని ముందే వదులుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.