చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో పరుగులు తీసిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మందగించటం ఒక ఎత్తు అయితే.. ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేసిన మొదట్లో వేసిన అంచనా మొత్తాన్ని మాత్రమే భరిస్తామని కేంద్రం కొర్రీ పెట్టటం తెలిసిందే. కేంద్రం నుంచి వచ్చిన ఈ సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యథావిధిగా పోలవరం ఎపిసోడ్ పాపం మొత్తం టీడీపీదేనని, చంద్రబాబే ఇందుకు బాధ్యత వహించాలని ఈ రోజున వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
లాజిక్ మరిచి విమర్శలు
ఇలాంటివేళ, లాజిక్‌గా మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్నింటిని చాలామంది మిస్ అవుతున్నారు. పోలవరం ప్రాజెక్టును దెబ్బ తీయాలనే ఆలోచన ఉంటే ఆరేళ్ల తర్వాత మోడీ సర్కారు ఉన్నట్లుండి తన స్టాండ్ ఎందుకు మార్చుకున్నట్లు? అన్నది ప్రశ్న. మొదట్నించే ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరాలు ఉంటే బాబు ప్రభుత్వంలోనూ ఇప్పటిమాదిరే కొర్రీలు వేసే వారు కదా? ఆ మాటకు వస్తే.. ప్రాజెక్టు వ్యయాన్ని పెంచటం మీద అప్పట్లో జగన్ అండ్ కో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కమిషన్ల కక్కుర్తితోనే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచినట్లుగా పేర్కొన్నారు. అయినా బాబు సర్కారు చేసిన మార్పులకు నాటి మోడీ మంత్రివర్గం ఓకే చెప్పింది. అంత చేసిన మోడీ సర్కారు, ఇప్పుడు ఉన్నట్లుండి కొర్రీలు పెట్టాల్సిన పనేముంది? అన్న ప్రశ్న దగ్గర కాస్త ఆగి.. అక్కడే మరింత లోతుల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు రావటం ఖాయమన్న మాటలు తరచూ వినిపిస్తున్నాయి.
చెప్పినా వినకుండా..
ఈ మాటలకు బలం చేకూరేలా తాజాగా చంద్రబాబు మీడియాతో చెప్పిన మాటలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు చేసే సంస్థను మార్చిన వేళ తాము తీసుకున్న నిర్ణయం కేంద్రాన్ని సంప్రదించి, వారి అనుమతితోనే చేసినట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్సు టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్‌ను మార్చే పనిలో పడ్డారన్నారు. కేంద్రం ఆ పని చేయొద్దని సలహా కూడా ఇచ్చినా.. వినకుండా రివర్సు టెండరింగ్ అంటూ ముందుకు వెళ్లారు. అక్కడే కేంద్రానికి.. జగన్ సర్కారుకు మధ్య గ్యాప్ మొదలైందని పేర్కొన్నారు. ఇదంతా చూస్తే.. జగన్ మొండితనం.. ప్రాజెక్టు విషయంలో ఎక్కడైతే టచ్ చేయకూడదో అక్కడ టచ్ చేసినందుకు తాజా పరిణామాలన్న భావన కలుగక మానదు.











