ఏమైనా అనుభవం అనుభవమే. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు చేయలేనిది జగన్ చేసినట్లుగా తరచూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంటారు. జగన్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోస్టు చేసే ట్వీట్లలో ఈ ఎటకారం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మాటలకు కొన్నిసార్లు నిదానంగా సమాధానం లభిస్తుంది. కేంద్రం పెట్టిన పోలవరం కిరికిరితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ సర్కారుకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. విపక్ష నేతగా ఉన్నప్పుడు బాధ్యత లేకుండా మాట్లాడిన మాటలు ఇప్పుడు పోలవరంపై జగన్ నోట మాటలు రానివ్వకుండా చేసిన పరిస్థితి.
ఇలాంటి వేళ..
పోలవరం ఇష్యూను కేంద్రంతో ఎలా డీల్ చేయాలన్న విషయంపై బాబు ఇస్తున్న సలహాలు.. సమాచారం చూస్తే.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బలం ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు. పోలవరం ఎపిసోడ్‌పై చంద్రబాబు తాజాగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించారు. అంతేకాదు, పోలవరం ఎపిసోడ్‌ను ఎలా డీల్ చేయాలన్న విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బాబు మాట్లాడిన మాటల్ని జాగ్రత్తగా వింటే.. జగన్ సర్కారు అపరిపక్వత.. విపక్ష నేతకున్న అనుభవం మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.
ఇలా డీల్ చేయవచ్చు
పోలవరం ఎపిసోడ్‌ను డీల్ చేయాల్సిన పద్ధతిని.. వినిపించాల్సిన వాదనపై బాబు ప్రస్తావించిన అంశాల్ని చూస్తే.. జగన్ సర్కారు ఏం చేయాలో ఇట్టే అర్థం కాక మానదు. బాబు తాజాగా చెప్పిన మాటల్లోని కీలకాంశాల్ని చూస్తే..
– పోలవరం ప్రాజెక్టు అంచనాలను కుదిస్తూ 2017లో కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. దానివల్లే ఇప్పుడు నిధులకు కోత పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెబుతున్న మాటలు నిజం కాదు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులిస్తామని కేంద్ర కేబినెట్ తీర్మానంలో స్పష్టంగా చెప్పారు. దాన్ని జగన్ సర్కారు వక్రీకరిస్తోంది.
– పోలవరం ప్రాజెక్టులో ఇరిగేషన్ కాంపొనెంట్‌లో మిగిలిన వ్యయం వంద శాతాన్ని 2014 ఏప్రిల్ ఒకటి నుంచి మొత్తం కేంద్రం అందిస్తుంది. భారత ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీనిని నిర్మిస్తుంది. దానితోపాటు మొత్తం సమన్వయం, నాణ్యత నియంత్రణ, డిజైన్ల అంశాలు, పర్యవేక్షణ, అనుమతులకు సంబంధించిన అంశాలను కేంద్ర జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిశీలిస్తుంది.
– కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ పద్దుల విభాగంతో సంప్రదించి ఇరిగేషన్ కాంపొనెంట్ వ్యయాన్ని పీపీఏ అంచనా వేస్తుంది. ప్రాజెక్టు అంచనాల్నికుదిస్తున్నట్లుగా ఎక్కడా పేర్కొనలేదు. (ఈ మాటల్ని చెప్పిన బాబు.. అందుకు తగ్గట్లే నాటి కేంద్ర కేబినెట్ చేసిన తీర్మాన ప్రతిని విడుదల చేశారు)
– ఇక్కడ గల్లీలో వంద మాట్లాడుకోవచ్చు. కానీ కేంద్రానికి ఒక లేఖ రాసేటప్పుడు బాధ్యతగా రాయాలి. అందులో గత ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు చేయకూడదు. దానివల్లే చులకన అవుతున్నారు. ఏం కావాలో అడక్కుండా మాపై బురదజల్లడం ఏమిటి? చెత్త లేఖలు రాస్తున్నారు. ఏం తప్పు చేశామని విమర్శిస్తారు?
– ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో కేసులుంటే అనేక ప్రయత్నాలతో వాటిని విరమింపజేశాం. అన్ని అనుమతులూ తెచ్చాం. పోలవరం పూర్తి చేసి గోదావరి నీటిని రాయలసీమ వరకూ తీసుకెళ్లాలని ప్రణాళికలు రూపొందించాం. ఉత్తరాంధ్రకు ఈ నీరందేలా చేయాలని ప్రయత్నించాం.
– పోలవరం ప్రాజెక్టులో సాగునీటి ప్రాజెక్టు… పవర్ ప్రాజెక్టు ఉన్నాయి. విద్యుత్ ప్రాజెక్టుకు తాము నిధులిస్తే ఆ విద్యుత్‌ను దేశమంతా పంచాల్సి వస్తుందని కేంద్రం చెప్పింది. అక్కడ వచ్చే మొత్తం కరెంటును మనమే తీసుకోవాలనుకున్నాం. అందుకే విద్యుత్కేంద్రాన్ని మేమే కట్టుకుంటామని చెప్పాం. అందుకు కేంద్రం ఓకే చెప్పింది.
– విద్యుత్ ప్రాజెక్టు కలపకపోవడం వల్ల ప్రత్యేకంగా ఇరిగేషన్ కాంపొనెంట్ అని ప్రస్తావించారు. దాని వరకూ ఎంత ఖర్చయితే అంత నూటికి నూరు శాతం ఇవ్వడానికి ఆ తీర్మానంలో కేంద్ర మంత్రి వర్గం అంగీకరించింది.
– 2013 భూసేకరణ చట్టం అమల్లోకి రావడంతో.. దానివల్ల పెరిగే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకోవడం కోసం ఈ తీర్మానం చేశారు. రమేశ్‌చంద్ర అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్‌లో సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇస్తూ ఇరిగేషన్ కాంపొనెంట్‌లో భూ సేకరణ వ్యయం, సహాయ పునరావాస ఖర్చులు కూడా కలిపి ఉంటాయని పేర్కొంది. (దీనికి సంబంధించిన ప్రతిని మీడియా సమావేశంలో చంద్రబాబు విడుదల చేశారు)
– ఒకసారి పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడడానికి పండగ వేళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నాగపూర్‌లో ఉన్నారు. ఆయన ఇంటి వద్ద ఉంటే సీఎంగా వెళ్లి ఆయన్ను కలిసి మాట్లాడా. అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వద్ద ఢిల్లీలో సమావేశం ఉంటే ఒక విద్యార్థిలా ముందురోజు రాత్రంతా దానిని చదువుకుని మర్నాడు ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చా.
– కేంద్ర మంత్రివర్గం అంచనాలు పెంచొద్దని తీర్మానం చేస్తే టీఏసీ ఇన్ని మీటింగ్‌లు పెట్టదు కదా? మాట్లాడేవారికి బుర్ర ఉందా? కేంద్ర మంత్రివర్గ తీర్మానాన్ని టీడీపీ మంత్రులు వ్యతిరేకించలేదంటున్నారు. నిధులు ఇస్తామంటే వ్యతిరేకిస్తారా ఎవరైనా? ఇప్పుడు మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైనా ఆధారాలు చూపిస్తారా? మిడిమిడి జ్ఞానంతో వాళ్లు మాట్లాడుతుంటే.. వారిని ప్రశ్నించరేం?