చిన్న వయసులోనే భారీ ఎదురు దెబ్బలు తినటం ఒక ఎత్తు అయితే.. అవన్నీ కూడా కోరి తెచ్చుకున్న తిప్పలుగా కనిపిస్తాయి. గెలుపు వేళ.. ఓటములు కనిపించవు. ఆ సూత్రం జగన్ కు కూడా వర్తిస్తుంది. ఆయన ఈ రోజు తిరుగులేని అధికారాన్నిఅందుకున్నది మాత్రమే కనిపిస్తుంది.అందుకు ఆయన దాదాపు పదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చిందన్నది మర్చిపోకూడదు. వాస్తవానికి.. తన తండ్రి మార్గాన్ని ఎంచుకొని ఉంటే.. జగన్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఆయన్ను ఎప్పుడో ముఖ్యమంత్రిని చేసి ఉండేది.
తన తొందరపాటుతో రాంగ్ స్టెప్ వేసిన ఆయన.. తాను అనుకున్నది సాధించేందుకు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న.
జగన్ మీద అభిమానంతో ఆయన్ను తలకెక్కించుకునే కొందరిని మినహాయిస్తే.. ఒక విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారు. వైఎస్ కొడుకుగా జగన్ ను అభిమానించే వారంతా.. తండ్రికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎవరూ ఈ రోజున జగన్ వెంట లేరన్న చిన్న లాజిక్ ను మర్చిపోతారు. ఎందుకలా? అన్న ప్రశ్న వేసుకుంటే చాలానే సమాధానాలు లభిస్తాయి. నిజానికి.. తనకున్న మొండితనంతోనే అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన జగన్.. ఈ రోజు ఏపీ అనే చిన్న ముక్కకు సీఎం అయినందుకు సంతోషపడిపోతున్నారు. తాను అనుకున్నది సాధించేందుకు ఎదురుగా అవకాశాలు ఉన్నా.. తాను నమ్మిన దారిలోనే వెళ్లి సాధించాలన్న పట్టుదల చూసినప్పుడు.. జగన్ తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది.
విపక్ష నేత చంద్రబాబును రాజకీయంగా టార్గెట్ చేయటం అంటే.. అందుకు ఎక్కడెక్కడో లింకులు కదిపి.. సుప్రీంకోర్టులో నెంబరు టూ గా ఉన్న తెలుగు న్యాయమూర్తి మీద కత్తిదూయాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. బాబును టార్గెట్ చేసేందుకు తేనెతుట్టెను కదల్చే సాహసమే కాదు.. రాణి తేనెటీగ మీద కత్తి చూసిన ఆయన.. కీలకమైన విషయాల్ని మర్చిపోయారా? అన్నది ప్రశ్న.
మొండితనం ఆభరణంగా ఉన్నంతవరకు ఓకే అనేవారు.. ఆయుధంగా మార్చి అదే పనిగా ప్రయోగిస్తే.. ఊరుకోరన్నది మర్చిపోకూడదు. మొండితనంతో ఏదైనా సాధించొచ్చని చెప్పేటోళ్లు.. అదే మొండితనంతో మొదటికే మోసం తెస్తుందని.. మొత్తంగా ముంచేస్తుందన్న విషయాల్ని మర్చిపోకూడదు.
వ్యక్తి పేరుతో వ్యవస్థను టార్గెట్ చేస్తున్నట్లుగా పలువురు చేస్తున్న వాదనలకు బలం చేకూరేలా ఆయన మీద ఉన్న కేసులపై కొత్త చర్చ షురూ అయ్యింది. రేపొద్దున ఆయనపై ఉన్న కేసుల్లోని ఆధారాల ఆధారంగా తీర్పులు చెప్పిన న్యాయమూర్తులపై ఇదే తరహా బురద జల్లితే అప్పుడేం జరుగుతుంది? దీన్నో అలవాటుగా మార్చుకొని.. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు కోర్టు తీర్పుల మాదిరి కాకుండా.. సదరు జడ్జి ఇచ్చిన తీర్పులుగా చేసే విభజన కొత్త సమస్యల్ని తీసుకొస్తుందన్నది మర్చిపోకూడదు.
రాణి తేనెటీగ టార్గెట్ చేసే క్రమంలో చుట్టూ ఉన్న తేనెతుట్టెను కదల్చటానికి పెట్టిన మంట ఏ క్షణంలో అయినా ఆరిపోవచ్చు. ఒత్తికి అంత శక్తి లేకపోవచ్చు. లేదంటే.. మధ్యలో వరుణుడికి కూడా నచ్చక వర్షం రూపంలో జాడిస్తే.. మంట ఆరిపోతుంది. అంతేకాదు.. తడిచిపోయిన ఒత్తి..తిరిగి వెలగటానికి చాలానే సమయం పడుతుంది. ఈ విషయాల్ని మర్చిపోతున్నారా? మర్చిపోయినట్లు నటిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.











