ఆంధ్రజ్యోతి కథనం వాస్తవం. తెలంగాణ రాజకీయాన్ని చూసుకోవడానికి వైఎస్ షర్మిల నడుం బిగించారు. తన తల్లిదండ్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి- విజయమ్మ ల పెళ్లిరోజు అయిన ఫిబ్రవరి 9 వ తేదీనాడు (అంటే మంగళవారం) ఆమె తన ‘సొంత’ రాజ్య ఏర్పాటు కాంక్షతో రాజకీయ కార్యకలాపాలకు ఆమె శ్రీకారం చుట్టబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఆమె తెలంగాణ శాఖను నిర్వహిస్తారా? లేకపోతే.. తన సొంత అస్తిత్వ నిరూపణకు సొంత సామ్రాజ్య ఏర్పాటుకు సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేస్తారా? అనే విషయంలో మంగళవారం సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది. తెలంగాణలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురితో పాటు, వైఎస్సార్ అభిమానుల్ని కూడా షర్మిల ఈ సమావేశానికి ఆహ్వానించారు. తెలంగాణలో పాదయాత్ర చేసినప్పుడు.. తన వెంట నిలిచిన వారినందరినీ కూడా పిలిచారు. ఈ సమావేశాన్ని హైదరాబాదులోని జగన్ నివాసం లోటస్ పాండ్ లోనే ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా.. తన కార్యకలాపాలను షర్మిల ప్రారంభిస్తున్నారు. మంగళవారం నాడు ఉదయం ఉమ్మడి నల్గొండ జిల్లా వారితో సమావేశం ఉంటుంది. అలాగే క్రమంగా అన్ని జిల్లాల వారితో సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాల నుంచి ఎలాంటి కార్యచరణకు ప్రణాళిక రచించాలో తేలిన తర్వాత.. జిల్లాల వారీగా షర్మిల పర్యటనలు కూడా ఉంటాయి.
ఆంధ్రజ్యోతి వార్త వాస్తవమే
తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలను చూసుకోవడానికి వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నట్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కొన్ని రోజుల కిందట ఒక సవివరమైన బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. అయితే.. అందులో వాస్తవమెంత అంటూ చర్చోపచర్చలు జరిగాయి. కేసీఆర్ తో ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో జగన్- ఆయనతో సున్నం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారా? అనే సందేహాలు పలువురిలో కలిగాయి. అయితే.. అదే కథనంలో వైఎస్ జగన్ తో సంబంధం లేకుండా.. సొంత రాజకీయ పార్టీ పెట్టుకోడానికే షర్మిల మొగ్గు చూపుతున్నారని.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ఆమె విసిగిపోయి ఉన్నారని.. అసలైన రాజన్న పాలన అంటే ఏమిటో.. ఒక ఆదర్శంగా చూపించడమే లక్ష్యంగా తన సొంత పార్టీని ప్రారంభించబోతున్నారని వార్తలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన, ముఖ్యమైన వారెవ్వరూ దీనిపై స్పందించకపోయినప్పటికీ.. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వార్త నిజమని తేలుతోంది.
జగన్పై షర్మిల విసిగిపోయారా?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై చెల్లెలు, ‘జగనన్న వదిలిన బాణం’ గా తనను తాను అభివర్ణించుకున్న వైఎస్ షర్మిల విసిగిపోయారా? అనే విశ్లేషణలే ఇప్పుడు ఎక్కువగా వినవస్తున్నాయి. రాజన్న రాజ్యం అందిస్తాననే ఎజెండాతోనే ఏపీలో జగన్ సీఎం అయ్యారు. అయితే ఆయన పనితీరు.. రాజన్నను తలపించేలా లేదనే విమర్శలు సొంత పార్టీలో కూడా దండిగానే ఉన్నాయి. ఇలాంటి పోకడల మీద సొంత చెల్లెలు కూడా అసంతృప్తితోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
పైగా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. రాజకీయంగా షర్మిలకు ఎలాంటి ప్రాధాన్యమూ దక్కలేదు. ఎన్నికల సమయంలో ఆమెను ఎంపీగా బరిలో దించుతారని అంతా అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం ఆమె ఇతోధికంగా కష్టపడ్డారు. ఎన్నికలు ముగిసిన తర్వాత.. షర్మిలకు రాజ్యసభ ఎంపీ పదవి దక్కుతుందనే ప్రచారం కూడా బాగా జరిగింది. అది కూడా నిజం కాలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఏరకంగానూ వారికి ప్రాధాన్యం దక్కినట్టుగా కనిపించలేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ వరకు పరిమితం అయ్యేలా.. రాజకీయ కార్యకలాపాలను షర్మిల ప్రారంభించబోతున్నారు.
అయితే సొంతంగా మరొక పార్టీ పెడతారా? వైకాపా ముద్ర మీదనే ఇక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారా అనే క్లారిటీ మాత్రం లేదు.
ఇప్పుడే ఎందుకు?
తెలంగాణలో 2014లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నామమాత్రపు ప్రభావంతో పరాజయాన్ని మూటగట్టుకుంది. తర్వాత.. తెలంగాణ పార్టీని పూర్తిగా జగన్ గాలికొదిలేశారు. ఏపీ మీద మాత్రం ఫోకస్ పెట్టి పవర్లోకి వచ్చారు. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోలనూ అన్నాచెల్లెళ్లు ఇటువైపు చూసిన పాపాన పోలేదు. ప్రత్యేకించి జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కొందరు వైఎస్సార్ అభిమానులు పోటీకి ఉత్సాహం చూపినప్పటికీ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో అధికార తెరాస బలహీన పడిన సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణోళ్లు- ఆంధ్రోళ్లు అని పనిగట్టుకుని ద్వేషభావాలతో చూసే పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటప్పుడు కొత్త రాజకీయ పార్టీగా ఎంట్రీ ఇస్తే ఎంతో కొంత అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో షర్మిల ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే సెటిలర్ము, ఆంధ్రా వాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత దృష్టి పెడుతున్నట్టు సమాచారం.
కేసీఆర్ కోసం జగన్ స్కెచ్- అని ఒక ప్రచారం
షర్మిల పార్టీని పెట్టడం లేదా తెలంగాణ శాఖను లీడ్ చేయబోవడం ఇదంతా కూడా కేసీఆర్ కోసం జగన్ నడిపిస్తున్న డ్రామా అనే ప్రచారం కూడా ఉంది. ఇటీవలి పరిణామాల్లో కేసీఆర్ బలహీన పడడం, విపక్ష బీజేపీ బాగా బలపడడం జరుగుతూ వస్తోంది. ఇదే దూకుడు కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి తెరాసకు ఓటమి తప్పదనే అభిప్రాయం కూడా పలువురిలో ఉంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి అంతిమంగా తెరాసకు మేలు చేయడానికే జగన్ ఒక వ్యూహం ప్రకారం చెల్లెలు షర్మిలతో తెలంగాణ రాజకీయ కార్యకలాపాలు నడిపిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ వ్యూహం సరిగ్గా వర్కవుట్ అయితే.. షర్మిల పార్టీకి ఒకటి రెండుసీట్లు దక్కినా.. చివరికి టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికే అవి ఉపకరిస్తాయి అని కూడా పలువురు అంటున్నారు.
షర్మిలకు ఎంపీ పదవే ధ్యేయమా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పడిన కష్టానికి షర్మిలను ఎంపీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు.. ఆమెను టీఆర్ఎస్ విజయంకోసం పరోక్షంగా ఉపయోగపడేలా చేస్తే.. చివరికి పొత్తుల రూపంలో అయినా టీఆర్ఎస్ ద్వారా.. రాజ్యసభకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఏ పరిణామాలు ఎలా మలుపు తిరిగినా.. షర్మల ఎంపీ గా పార్లమెంటులో అడుగుపెట్టడం కోసమే.. ఈ రాజకీయ ఎత్తుగడలు అనే ప్రచారం బాగా ఉంది.
ఈ ఊహాగానాలన్నీ తప్పయి, స్వతంత్రంగానే పార్టీ నడపడానికి ప్రయత్నించినా కూడా.. షర్మ ల మాత్రం.. తెలంగాణ ఎమ్మెల్యే బరిలోకాకుండా ఎంపీ బరిలోనే తలపడతారనే ప్రచారం కూడా ఉంది.
జగన్కు పరువు నష్టం
జగన్ స్కెచ్ కావొచ్చు, షర్మిల సొంత కుంపటి కావొచ్చు.. ఏది ఏమైనా.. ఆమె ఇవాళ్టి సమావేశాలతో రాజకీయంగా సొంత అస్తిత్వం చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నం వలన ఏపీలో జగన్మోహన రెడ్డికి పరువు నష్టం అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అన్నయ్యను సొంత చెల్లెలే నమ్మకపోతే.. ఏపా రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారనే ప్రచారం విపక్షాలు అప్పుడే ప్రారంభించాయి. అసలే ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న తరుణం.. ఇలాంటప్పుడు.. అన్నయ్యను చెల్లెలు షర్మిల నమ్మకుండా.. సొంత పార్టీ పెట్టుకుంటోందనే సమాచారం బయటకు రావడం వల్ల.. హార్డ్ కోర్ వైఎస్ఆర్ అభిమానుల్లో కూడా జగన్ పట్ల, ఆయన తీరు పట్ల అనుమానాలు, భిన్నాభిప్రాయాలు మొదలయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలుఎటు వెళ్లి ఎటు మలుపు తిరుగుతాయో వేచిచూడాలి.