( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
‘నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో’… ఓ చిత్రంలోని డైలాగ్ ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన సూచన ఇందుకు అచ్చంగా సరిపోతుంది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నో హృదయ విదారక ఘటనలు, ప్రాణ త్యాగాలు, పంట పొలాల వితరణ… ఇలా ఎన్నో ముడిపడి ఉన్నాయి. ఇరవైఒక్క వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పట్లో భూ సమీకరణ చేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉండడంతో రైతులు తమ పంట పొలాలను స్వచ్ఛందంగా అప్పగించారు. అందుకు వారికి ముట్టింది ఎకరాకు కేవలం 1500/- అయినా భవిష్యత్ తరాల కోసం భూములు పరిశ్రమ కోసం త్యాగం చేశారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో 7. 3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. కంపెనీ ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమ బాట పట్టాయి. ఈ తరుణంలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్… కేంద్రానికి లేఖ రాశారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమను ఆదుకునేందుకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగా ముడి ఖనిజానికి అదనపు చెల్లింపులు వల్ల పరిశ్రమపై 3, 473 కోట్ల రూపాయల భారం పడుతోందని, సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ చెల్లించాల్సిన రుణాలను వాటాల రూపంలోకి మార్చితే ఒత్తిడి తగ్గుతుందని, వడ్డీల బెడద కూడా ఉండదని సీఎం తెలిపారు. ఈ రుణాలను వాటాల రూపంలోకి మార్చి స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ ద్వారా బ్యాంకులకు ఎగ్జిట్ ఆప్షన్ కలిగించవచ్చని సీఎం పేర్కొన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. మరో సూచనే చాలా ఇబ్బందికరంగా పరిణమించేలా ఉందని ప్రతి పక్షాలు, వివిధ కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
భూముల అమ్మకం ప్రతిపాదన..
ముఖ్యమంత్రి చేసిన మరో ప్రతిపాదన ఉద్యోగులు, కార్మిక వర్గాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. స్టీల్ ప్లాంట్‌కు వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, మిగిలి ఉన్న భూముల్లో ప్లాట్లు వేసి విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని సీఎం లేఖలో స్పష్టం చేశారు. ఈ డబ్బు ప్లాంట్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
పోస్కోను ఎందుకు వ్యతిరేకించినట్లు?
కొరియాకు చెందిన పోస్కో స్టీల్, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి ఐదేళ్ల క్రితం కేంద్రానికి ప్రతిపాదన చేసింది. హై గ్రేడ్ స్టీల్ ఉత్పత్తుల్లో పోస్కో సంస్థకు మంచి పేరు ఉంది. స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్లో 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పాలి అన్నది ఆ సంస్థ లక్ష్యం. ఇందుకోసం తొలుత ఒడిశాలో ప్రయత్నించి, అక్కడ ప్రతిఘటన ఎదురుకావడంతో ప్లాన్ ‘ బి’ లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేసింది. వేల కోట్లు విలువ చేసే భూములను అప్పనంగా కొట్టేయాలని స్కెచ్ వేసింది. కేంద్రం సహకారం కూడా ఉండడంతో ఆ ప్రతిపాదన దాదాపుగా కార్యరూపం దాల్చే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో ట్రేడ్ యూనియన్లు వివిధ రకాల ఆందోళనలు చేయడంతో కేంద్రం వెనకడుగు వేసింది.
భూ సమీకరణ అతిపెద్ద సవాలు..
ప్రస్తుత తరుణంలో కొత్తగా పరిశ్రమలు నెలకొల్పాలంటే భూ సమీకరణ అతిపెద్ద సవాలుగా మారింది. భూ సమీకరణ చట్టాలకు అనుగుణంగా స్థల సేకరణ చేయాలంటే అందుకోసమే వేలకోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అడ్డగోలుగా ప్లాంట్ కోసం సేకరించిన స్థలాన్ని కొట్టేయాలని చేసిన ప్రయత్నం విఫలం చేయడంలో ఉద్యోగులు సక్సెస్ అయ్యారు. సుమారు లక్ష కోట్లు విలువ చేసే భూములను వదులుకోవడం ఇష్టంలేక, భవిష్యత్తులో విస్తరణ పనులకు భూములు సమీకరించే అవకాశం లేక.. ఉపాధి అవకాశాలను సైతం వదులుకొని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
మరి జగన్ చెబుతోంది ఏంటి?
ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి కేంద్రానికి అనుకూలంగా ప్రతిపాదన చేశారో? ఉద్యోగులకు అనుకూలంగా ప్రకటన చేశారో? అర్థం కాక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. భూములు అమ్ముకునే ఆలోచనే ఉంటే.. ఇన్ని వేల కోట్లు అప్పులు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎటువంటి షరతులు లేకుండా… కేంద్రం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సంస్థకు సొంత గనులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.