Janasena supports Amravati Farmers’ Maha Padayatra
అప్రతిహాతంగా సాగుతున్న పాదయాత్ర!
నవంబర్ 1 నుంచి తుళ్లూరు నుంచి తిరుమలకు ‘న్యాయంస్థానం టూ దేవస్థానం’ పేరుతో రాజధాని రైతులు తలపెట్టిన పాదయాత్ర .. గుంటూరు, ప్రకాశం జిల్లాలో నడిచి అశేష ప్రజాదరణను పొందింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం వద్ద రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. ఏపి రాజధాని తుళ్లూరు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రకు తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు, దళిత సంఘాలు మద్దతు తెలుపాయి. ఈ క్రమంలో మద్దతు ప్రకటనతో సరిపెట్టిన బీజేపీ … రైతులు చేస్తున్న ఉద్యమం, పాదయాత్ర వేడిని గుర్తించిన నవంబర్ 21న నెల్లూరు జిల్లా కావలిలో రైతులను కలిసి సంఘీభావం తెలిపింది. ఏపికి ఒకటే రాజధాని .. మూడు రాజధానుల ఏర్పాటును ఒప్పుకుని ప్రశక్తే లేదని బీజేపీ తెగెసి చెప్పింది. అలా బీజేపీ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుందో లేదో మరుసటి రోజునే జగన్ రెడ్డి తాను గతంలో ప్రకటించిన అర్థంపర్థంలేని మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయినా రైతులు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పేవరకు పాదయాత్రతోపాటు, ఉద్యమం అలానే కొనసాగిస్తామని అమరావతి జేఎసీ, రైతులు భీష్మించారు.
జన సైనికులు కూడా ..
మొదటి నుంచి రైతు సమస్యలపై తక్షణమే స్పందించే జనసేనాని … మూడు రాజధానుల ప్రకటనను తొలినాళ్ళ నుంచే తప్పుపడుతు వస్తున్నారు. వికేంద్రీకరణ అభివృద్ధిలో చూడాలేకాని అమరావతి మార్పుతో కాదు అన్నది పవన్ స్టాండ్. ఈ ధోరణిలో ‘న్యాయంస్థానం టూ దేవస్థానం’ మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించారు పవన్. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం వద్ద జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. తన సంఘీభావాన్ని తెలిపి, తిరుమల చేరే వరకు జనసైనికులు రైతులతో ఉంటారని ప్రకటించారు. ఇక మీదట రాజధాని రైతులు తలపెట్టే పోరాటాలలో తాము తప్పక పాల్గొని పూర్తి మద్దతునిస్తామని మనోహర్ రైతులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో జనసైనికులు భుజంపై ఆకుపచ్చ టవల్ ధరించి వచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు.











