టాలీవుడ్ లో కమర్షియల్ మూవీస్ కి పితామహుడు లాంటివాడు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. యన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులాంటి అగ్ర కథానాయకులకు కెరీర్ బెస్ట్ మూవీస్ ఇచ్చిన ఆయన .. ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జున లాంటి హీరోలకూ ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. అంతేకాదు ఇప్పటి తరం హీరోలతో కూడా కొన్ని సినిమాలు తీశారు. కొంతకాలంగా భక్తి మార్గం పట్టి వరుస సినిమాలు తీస్తున్న రాఘవేంద్రారావు దర్శకత్వంలో ఆఖరుగా వచ్చిన సినిమా నాగ్ తో తీసిన ఓం నమో వేంకటేశాయ. అప్పటినుంచి ఇప్పటి వరకూ రాఘవేంద్రరావు నుంచి మరో సినిమా రాలేదు.
అయితే.. ఈ రోజు తన నుంచి ఓ సరికొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదలవుతుందని ఆయన నిన్న తన ట్విట్టర్ పేజ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి తన సన్నిహితుల్ని కూడా ఆహ్వానిస్తున్నట్టు ఓ వీడియో రూపంలో చెప్పారు. అనుకున్నట్టుగానే కె.రాఘవేంద్రరావు తన అభిమానుల కోసం ఓ సూపర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. పెళ్లిసందడి మళ్ళీ మొదలవబోతోందని ప్రకటించారు. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన అలనాటి సూపర్ హిట్ చిత్రం ‘పెళ్ళి సందడి’కి ఇది సీక్వెల్ అనుకోవాలి.
పెళ్ళిసందD గా ఈ సినిమాకి టైటిల్ డిజైన్ చేయించారు. కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్స్, శ్రీధర్ సీపాన రచన.. ఇంకా ఈ సినిమా ఆర్కామీడియా, ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ సంయుక్త నిర్మాణంలో రాబోతోందని చెప్పిన రాఘవేంద్రరావు .. కేస్టింగ్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే కేస్టింగ్ కూడా ఫిక్స్ చేసి ఈ ఏడాదే సినిమాను ప్రారంభించాలని రాఘవేంద్రరావు ఆలోచనట. అయితే పెళ్ళిసందడి మొదటి భాగానికి జయరాం కెమేరా మేన్ గా పనిచేశారు. మరి రెండో భాగానికి కూడా ఆయన్నే ఎంపికచేస్తారేమో . శ్రీకాంత్ , రవళి, దీప్తి భట్నాగర్ తో మొదటి భాగం డైరెక్ట్ చేసి సూపర్ హిట్టు కొట్టిన రాఘవేంద్రరావు ఇప్పటి జెనరేషన్ లో పెళ్ళిసందడిని ఏ రేంజ్ లో తీస్తారో చూడాలి.
#PelliSandadi…
మళ్ళీ మొదలవ్వబోతుంది….
తారాగణం త్వరలో… pic.twitter.com/fvOqagnhpT— Raghavendra Rao K (@Ragavendraraoba) October 9, 2020











