తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. మార్చి 22 నుంచి మే 31 వరకు లాక్ డౌన్ విధించడంతో తక్కువగా కేసులు నమోదయ్యాయి. జూన్ మొదటి వారం నుంచి కేంద్రం అన్ లాక్ లకు అనుమతి ఇస్తుండటంతో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొదట్లో తక్కువ టెస్టులు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. కానీ హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సంస్థ నిర్దేశాల ప్రకారం ప్రతి పదిలక్షల మందిలో 140 మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. తాజాగా 24 గంటలలో 53,086 టెస్టులు నిర్వహించగా మొత్తం టెస్టుల సంఖ్య దాదాపు 35 లక్షలకు చేరుకుంది.
బుధవారం నుంచి గురువారం వరకు నమోదయిన కేసుల జాబితాని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,891 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,878 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,208 కు చేరింది. ప్రస్తుతం 26,374 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారని ఆ జాబితాలో పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 285 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 175 కేసులు నిర్దారణ అయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 195. నల్గొండ జిల్లాలో 128 కేసులు నమోదయ్యాయి.