ఆర్.ఎక్స్. 100 సినిమాతో టాలీవుడ్ లో సంచలనం రేపాడు కార్తికేయ. యాక్షన్ తో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఆయన పోషించిన ‘శివ’ పాత్ర యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. కార్తికేయ హైట్ .. పర్సనాలిటీ ఆ పాత్రకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేయడంతో, కార్తికేయకి వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. అయితే ఆ తరువాత కథలను ఎంచుకునే విషయంలో ఆయన తడబడ్డాడు. ఈ కారణంగానే ‘హిప్పీ’ .. ‘గుణ 369′ .. ’90 ML’ సినిమాలు పరాజయాలను చవిచూశాయి.
కార్తికేయ తన తదుపరి సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై చేస్తున్నాడు. ‘చావుకబురు చల్లగా’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కార్తికేయ నటిస్తున్నాడు. అంతిమ సంస్కారాలకి శవాలను స్మశానానికి తరలించే వాహనాన్ని నడిపే డ్రైవర్ గా, పక్కా మాస్ లుక్ తో ఆయన ఈ సినిమాలో కనిపించనున్నాడు. శవాల దగ్గర ఏడుపులు వింటూ నిస్సారంగా గడిచిపోయే జీవితంలో, కొంత మందును .. మరికాస్త రొమాన్స్ ను వెతుక్కునే ఈ పాత్ర, ట్రైలర్ ద్వారా ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది.
ఇప్పుడు ఈ సినిమాపైనే కార్తికేయ ఆశలు పెట్టుకున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వచ్చే సినిమాల్లో విషయం వుంటుందనే నమ్మకం చాలామందిలో వుంది. కథలో కొత్తదనం ఉంటుందనే విషయాన్ని ఈ బ్యానర్ పై ఇంతకుముందు వచ్చిన సినిమాలు నిరూపించాయి. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాలో కార్తికేయ చాలా సాహసంతో కూడిన పాత్రను టచ్ చేశాడు. ఆయన లుక్ .. డైలాగ్ డెలివరీ ఇంతవరకూ చేసినవాటికి భిన్నంగా వుండనున్నాయి. కామెడీ టచ్ తో కూడిన ఈ పాత్ర తనని మాస్ ఆడియన్స్ కి మరింత చేరువ చేస్తుందని కార్తికేయ భావిస్తున్నాడు.
వరుస పరాజయాలతో సతమతమవుతున్న తనకి, ఈ సినిమా సక్సెస్ ను అందిస్తుందనే ఆశాభావంతో వున్నాడు. ఇక కార్తికేయ లుక్స్ చూసిన చాలామంది ఈ కుర్రాడు యంగ్ విలన్ గా కూడా బాగా సెట్ అవుతాడని అనుకున్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్ కి కూడా అలాగే అనిపించిందేమో, ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమా నుంచి విలన్ వేషం వెతుక్కుంటూ కార్తికేయ దగ్గరికి వచ్చింది. ఆ సినిమాలో కార్తికేయ చేసిన విలన్ రోల్ ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆయన చేసిన ఆ విలన్ రోల్ .. ఏకంగా తమిళ స్టార్ హీరో ‘అజిత్’ తో తలపడే విలన్ పాత్రను తెచ్చిపెట్టింది. ‘వలిమై’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాతో, తమిళంలో కార్తికేయ బిజీ కావడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.











