దక్షిణ భారత దేశంలో మొట్ట మొదటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజాతంత్ర వాదులు మంగళవారం పెద్దయెత్తున తమ నిరసన తెలిపారు. దీంతో మంగళవారం విజయనగరం ఆందోళనలతో అట్టుడికింది.
సంతకాల సేకరణ ..
సేవ్ మాన్సాస్ – సేవ్ ఎడ్యుకేషన్ అనే నినాదంతో విజయనగరం ఆర్.టి.సి.కాంప్లెక్స్ వద్ద జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, అరుకు పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘పాలకుల కక్ష – విద్యార్థులకు శిక్ష’ అంటూ నినదించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మేధావులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు , రాజకీయ పార్టీ ప్రతినిధులు, కళాశాల పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, మహారాజ కళాశాల పరిరక్షణ కమిటి సభ్యులు సహకరించారు.
మాన్సాస్ కార్యాలయం ముట్టడి
మహారాజ కళాశాలలో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్ వెంటనే చేపట్టాలని కోరుతూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అడ్డుకుని అరెస్టులు చేయడంతో వ్యవహారం రాద్ధాంతమైంది. విద్యార్థుల అరెస్టును మహారాజ కళాశాల పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల న్యాయమైన పోరాటాన్ని పరిరక్షణ వేదిక బలపరుస్తున్నట్లు ఆ వేదిక గౌరవ చైర్మన్ హెచ్. లక్ష్మణరావు, చైర్మన్ రెడ్డి శంకరరావు, కన్వీనర్ సురేష్ ఒక సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు.
విద్యార్థుల అరెస్టు సరికాదు : లోక్‌సత్తా
తమకు జరుగుతున్న అన్యాయాన్ని పాలకులకు తెలియచెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న విద్యార్థులను, ఎస్.ఎఫ్.ఐ.నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని లోక్‌సత్తా పార్టీ విజయనగరం జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తోందని ఆపార్టీ జిల్లా ప్రతినిధి అల్లంశెట్టి నాగభూషణం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జేసీకి వినతి
ఎమ్మార్ ఎయిడెడ్ కళాశాలలో తక్షణమే అడ్మిషన్లు జరిపించాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ కు టి.ఎన్.ఎస్.ఎఫ్ మంగళవారం వినతిపత్రం అందచేసింది. టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌ను విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో ఎంతోమందిని ఉన్నత స్థానానికి చేర్చిన విద్యాసంస్థ మహారాజ కళాశాల అని, ఇప్పటికీ ప్రతి సంవత్సరం సుమారు 3000 వేల మందికి అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ అని అన్నారు. అలాంటి కళాశాల నుండి ఇంటర్ తొలగించే ప్రయత్నంతో పాటు డిగ్రీ కళాశాలలో ఎయిడెడ్ అడ్మిషన్లు నిలిపివేయడం దారుణమని అన్నారు. ఇది ఉత్తరాంధ్ర విద్యార్థులందరి సమస్య కావున ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి తక్షణమే ఎయిడెడ్ అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థులకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్‌ను కోరారు. కార్యక్రమంలో టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షులు వేమలి చైతన్యబాబు, ప్రధాన కార్యదర్శి ప్రణయ్ కుమార్, ఉపాధ్యక్షులు భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్ కళాశాల ప్రైవేటీకరణ అంశం విజయనగరంలో కొద్దిరోజులుగా చాపకింద నీరులా సాగుతోంది. మంగళవారం దీన్ని నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడం, వేరొక వైపు జేసీని కలవడం, వారికి తెలుగుదేశం, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలకడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.