ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయతీ పెను సస్యసగా పరిణమించింది. ఇప్పటికే తండ్రి అని కూడా చూడకుండా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ ఆయనపై ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే మోహన్ బాబుకు ఆయన మరో షాకిచ్చేందుకు సిద్ధపడ్డాడు. తన భార్య మౌనికతో కలిసి మనోజ్ రాజకీయ తెరంగేట్రం చేస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
మనోజ్ రాజకీయ రంగ ప్రవేశం పెద్ద విషయమేమీ కాదు గానీ… కుటుంబంలో తగాదాలు రాజుకున్న కీలక సమయంలో వాటి పరిష్కారం దిశగా పెద్దగా ఆలోచించకుండానే ఆయన జనసేనలో చేరాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా మెగా ఫ్యామిలీతో మోహన్ బాబుకు చాలా ఏళ్లుగా అంతగా పొసగడం లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ పార్టీలో మనోజ్ చేరనుండటం మోహన్ బాబుకు షాకింగేనని చెప్పక తప్పదు.
ఆస్తుల తగాదానో, లేదంటే ఇంకో సమస్యో స్పష్టంగా తెలియడం లేదు గానీ… మోహన్ బాబు ఇంటిలో ఇప్పుడు పెను తుఫానే రేగింది. తండ్రితో కలిసి మంచు విష్షు ఒక జట్టుగా ఏర్పడితే… బార్య మౌనికతో కలిసి మనోజ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇక మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఎవరి పక్షమో కూడా తెలియడం లేదు. అయితే కుటుంబ తగాదాను పరిష్కరించే దిశగా ఓ మోస్తరు యత్నం చేసిన ఆమె… ఆ తర్వాత తనకేమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. ఇక మోహన్ బాబుకు సర్దిచెప్పే ధైర్యం చేసే వారు లేరనే చెప్పాలి.
ఇదిలా ఉంటే… మనోజ్ వరసబెట్టి పోలీసులను కలుస్తుండటం, ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడంతో కేసు నమోదు అయిన నేపథ్యంలో మోహన్ బాబు పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక ఇరు వర్గాలు బౌన్సర్లను రంగంలోకి దించి పరస్పరం దాడులకు యత్నించిన తీరు కూడా పెను వివాదాస్పదంగా మారింది. మోహన్ బాబుపై మనోజ్ చేయి చేసుకున్నారని, ప్రతిగా మనోజ్ పైనా మోహన్ బాబు చేయి చేసుకున్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మనోజ్ దంపతులు జనసేనలో చేరనుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.
మౌనిక దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కూతురు అన్నవిషయం తెలిసిందే. ప్రస్తుతం మౌనిక సోదరి అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆదిలో టీడీపీలో కొనసాగిన భూమా దంపతులు ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైైసీపీలో చేరారు. వైసీపీలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమదంలో చనిపోగా… ఆ తర్వాత కొన్నాళ్లకు గుండెపోటుతో నాగిరెడ్డి కూడా చనిపోయారు. అయితే చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఆయన తన కుమార్తె అఖిలప్రియతో కలిసి తిరిగి టీడీపీలోకి చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీలో అఖిలకు మంచి ప్రాధాన్యమే లభిస్తోంది. అఖిల సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా టీడీపీలో యువ నేతగా కీలకంగా పనిచేస్తున్నారు.
అయితే రాజకీయాల్లోకి రావాలనుకుంటే… తన తోబుట్టువులు కొనసాగుతున్న టీడీపీలోకి కాకుండా మౌనిక తన భర్తతో కలిసి జనసేనలో చేరాలనుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో వారి ప్లాన్ ఏమిటన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా ఇప్పటికిప్పుడు వారు రాజకీయాల్లోకి .ప్రవేశించడంపైనా పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకున్న తర్వాతే తమ కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయన్న కోణంలో పరోక్షంగా మోహన్ బాబు వర్గం ఆరోపణలు చేస్తున్న తరుణంలో మౌనికతో కలిసి మనోజ్ జనసేనలో చేరాలనుకోవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.











