అక్కినేని వారసుడు నాగార్జున కెరీర్ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. సరైన సినిమా వస్తే తప్ప నాగ్ వార్తల్లో నిలిచేలా కనిపించడం లేదు. ఇటీవలనే విడుదలైన బంగార్రాజు మీద ఆశలు పెట్టుకున్నా ఆశించిన ఫలితం కనిపించలేదు. పైగా ఈ సినిమాలో అక్కినేని మూడో తరం వారసుడు నాగచైతన్య కూడా ఉన్నాడు. బాలయ్యకు అఖండ మాదిరిగా నాగార్జునకు హిట్ వస్తేనే ఫలితం ఉంటుంది.
బంగార్రాజు తర్వాత ఆయన ఘోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ.. అడుగడుగునా.. అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. గతంలో ఈ సినిమా మొత్తానికే ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నాగార్జున సూచన మేరకు కథలో మార్పులు చేర్పులు చేయడంతో సెట్ అయ్యింది.
ఆ తర్వాత కాజల్ రూపంలో షాక్ తగిలింది. విషయం ఏంటంటే… ఈ సినిమాలో నాగార్జున సరసన నటించేందుకు కాజల్ ని ఫిక్స్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారట. అయితే.. కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. అప్పుడు అమలాపాల్, మెహ్రీన్, ఇలియానా… ఇలా కొంత మంది పేర్లను పరిశీలించి ఫైనల్ గా సోనాల్ చౌహాన్ ను ఫిక్స్ చేశారు. ఈ రోజు నుంచి దుబాయ్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
ఇప్పుడు మరోసారి ఈ ఘోస్ట్ మూవీ ఆగిందని సమాచారం. కారణం ఏంటంటే.. అంతా సెట్ అయిందనుకున్న టైమ్ లో యూనిట్ లో కొంత మంది కీలక సభ్యులు కరోనా బారిన పడ్డారు. దీంతో షెడ్యూల్ నిలిచిపోయింది. బంగార్రాజు సక్సెస్ తో మాంచి ఊపు మీదున్న నాగార్జున.. అదే జోష్ లో ఘోస్ట్ షూటింగ్ ను పూర్తి చేయాలనుకున్నాడు కానీ.. అతని ఉత్సాహానికి ఎప్పటికప్పుడు బ్రేకులేస్తోంది. మళ్లీ.. ఘోస్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో..? ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.











