ఇదీ తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ వేదికలు ఇస్తున్న బంపర్ ఆఫర్ . తెలుగు సాహిత్య రంగం ఓ వెలుగు వెలిగిన రోజుల్లో వార పత్రికల్లో – సీరియల్స్ లో ప్రేమ కథలు లేదా క్రైమ్ థ్రిల్లర్ సీరియల్స్ వచ్చేవి . కథల పోటీల్లో మాత్రం రిక్షా వాడి కష్టాలు, వేశ్యల కన్నీళ్లు, మధ్య తరగతి తండ్రి వ్యధలు .. లాంటి వాటికే బహుమతులు ఇచ్చే వారు. సీరియల్ రైటర్స్ కి వేలు, లక్షల పారితోషికాలు ఇచ్చేవారు. ఫ్యాన్ మెయిల్స్ కు అంతే ఉండేదికాదు . బహుమతి పొందిన కథా రచయితలు సెపరేట్ పీఠాలు పెట్టుకుని మేధావుల్లా పోజు కొడుతుండేవారు . ఇప్పుడు సినిమా పరిస్థితి అలాగే తయారైంది.
కొన్నేళ్ల క్రితం వరకు అంటే 1995 వరకు – ఆర్ట్ , కామెడీ క్రైం ఫార్ములా సినిమాలైనా థియేటర్స్ లో విడుదల కావలసిందే. టీవీ చానెల్స్ , యూ ట్యూబ్ ఛానల్స్ .. ఇప్పుడు ఓటీటీ వేదికలు వచ్చాక విభజన రేఖ స్పష్టంగా ఉంది. ముఖ్యంగా ఈ కరోనా గడ్డు కాలంలో ఇది కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. హీరోల ఫార్ములా సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ వేదికల్లో రిలీజయ్యే అవకాశాలు ఇప్పట్లో లేవు . దాంతో చిన్న , మీడియం , ఒరిజినల్ సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు అనే కాదు ఏ భాషా చిత్రమైనా ఒకటే సమస్య . నిర్మాతలు తీస్తున్నారో, ఓటీటీ వారు అడుగుతున్నారో తెలియడం లేదుగానీ బూతును భూతద్దలో చూపించేస్తున్నారు . లేదంటే విచ్చలవిడి శృంగారం , సైకో తరహా హింసతో మతి పోగొడుతున్నారు.
సత్య జిత్ రే లాంటివారు భారతీయ పేదరికాన్ని లోకానికి చూపించి కీర్తి గడించాడనే అపకీర్తిని మూటడట్టుకోవడం కూడా చూశాం. ‘ఆహా’ ఓటీటీని ప్రారంభించినప్పుడు దాని అధినేతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఇందులో బోల్డ్ కంటెంట్ ఉంటుందని ముందే ప్రకటించేశారు. బూతు కథలు రాజ్యమేలిన రోజులు కూాడా మనకు ఉన్నాయి. మధు సాహిత్యం, రమణి, అభిసారిక లాంటి పత్రికల్లో చూపించిన కంటెంటే ఇప్పుడు దృశ్యరూపంలో వస్తుందనుకోవచ్చు.
ఈ శృంగారపు ఛాయలో ఇక ఆర్ట్ ఫిలింలు తీసేవారు కూడా ఉండరేమో. వేరే తరహా ఎమోషన్స్, వినోదం లేవా ?! అవి రాసే వాళ్ళు, తీసే వాళ్ళు లేరా ? అన్న అనుమానం కూడా కలుగుతోంది. యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కళాత్మక షార్ట్ ఫిలింలు తీసిన వారు కూడా ఓటీటీకి వచ్చేసరికి బూతుకే పెద్ద వేయాల్సి వస్తోంది. మనుగడ కోసం ఇలాంటి వాటిని భరించక తప్పదేమో. వివిధ యాప్ లలో గ్యాప్ లేకుండా వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వాటిలో సెక్స్ కంటెంట్ చూస్తుంటే వామ్మో అనాల్సిందే. అది చూసి ‘ఆహా’కారాలు చేయాలేమో.











