భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలయ్యాయి. తొలి సర్వీసుగా రాత్రి స్కూట్ ఎయిర్‌లైన్స్ సింగపూర్‌కు బయలుదేరగా..సోమవారం ఉదయం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం ఇక్కడికి చేరుకుంది. ఈ తొలి దేశీయ విమాన ప్రయాణికులకు అధికారులు, GMR ప్రతినిధులు ఏటికొప్పాక బొమ్మలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ విమానాశ్రయంలో వాణిజ్య సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికులకు ఆయన స్వయంగా బోర్డింగ్ పాస్‌లు అందజేశారు. ఉదయం 7:30 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తొలి విమానం టేకాఫ్ అవ్వగా..ఆ తర్వాత 8 గంటలకు బెంగళూరు, 8:20కి ఢిల్లీ, 8:50కి హైదరాబాద్‌లకు వరుసగా సర్వీసులు బయలుదేరాయి. ప్రయాణికులు విశాఖ నుంచి భోగాపురం చేరుకునేందుకు వీలుగా 20 ఎలక్ట్రిక్ బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా దేశ, విదేశాలకు కనెక్టివిటీ ఏర్పడింది. ఇక్కడి నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై నగరాలకు రెగ్యులర్ దేశీయ సర్వీసులు నడవనున్నాయి. అలాగే ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్‌లైన్స్ ద్వారా సింగపూర్‌కు, ఇండిగో ద్వారా అబుధాబిలకు అంతర్జాతీయ విమానాలు అందుబాటులో ఉంటాయి. తొలిరోజైన సోమవారం 31 సర్వీసులు రాకపోకలు సాగించనుండగా.. సుమారు 6 నుంచి 7 వేల మంది ప్రయాణిస్తారని అంచనా.
మరోవైపు భోగాపురం ప్రారంభంతో పాత విశాఖపట్నం విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలకు శాశ్వతంగా తెరపడింది. ఆదివారం రాత్రి 10:45 గంటలకు ఢిల్లీ వెళ్లిన విమానమే విశాఖ నుంచి నడిచిన చివరి కమర్షియల్ సర్వీస్. అయితే, ఇప్పటివరకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేవలందించిన సుమారు వెయ్యి మంది సిబ్బందిని ఇకపై ఎక్కడ సర్దుబాటు చేస్తారు, వారి విధులు ఏమిటనే దానిపై అధికారుల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.











