రాష్ట్రంలోనే అత్యధిక మంది విద్యార్థులు చదువుతున్న విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సరికొత్త రూపురేఖలు సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే సుమారు రూ.10 కోట్లకు పైగా నిధులతో ఈ ప్రభుత్వ బడిని కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ బడులను ఉన్నతంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ముస్తాబైన ఈ అత్యాధునిక నూతన వసతులను రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ పాఠశాల జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో విద్యార్థులు రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడేవారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హడావుడిగా వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి చేతులెత్తేసినా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించారు. GVMC అధికారులతో సమన్వయం చేసుకుని రూ.3.23 కోట్లతో వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేశారు. విద్యార్థుల భద్రత, విద్యా వ్యవస్థల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, ప్రస్తుతం తుది దశకు చేరుకున్న ఈ వంతెన పనులే నిదర్శనం.
విద్యాభివృద్ధికి కూటమి సర్కార్ ఇస్తున్న ప్రోత్సాహంతో ప్రముఖ సంస్థ దివీస్ లేబొరేటరీస్ కూడా తన వంతు భారీ చేయూతను అందించింది. రాష్ట్ర విద్యా విధానానికి అనుగుణంగా ప్రాజెక్టు చంద్ర పేరిట రూ.6.5 కోట్ల CSR నిధులను ఈ పాఠశాల కోసం వెచ్చించినట్లు దివిస్ ల్యాబ్స్ ఎండీ డాక్టర్ మురళి కె.దివి తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, అత్యాధునిక క్రీడా మైదానం, సీసీ రోడ్లు, మూడు RO ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల కోసం ‘చంద్రవదన’ పేరిట భారీ కళావేదికను నిర్మించడంతో పాటు, భవనాలకు ఆకర్షణీయమైన రంగులు, ల్యాండ్‌స్కేపింగ్‌తో ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.
మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యను అందించేలా ఈ బడిలో హైటెక్ వసతులు కల్పించారు. ఏకంగా 50కి పైగా కంప్యూటర్లతో పాటు, సెయింట్ సంస్థ భాగస్వామ్యంతో AI ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. IFP బోర్డులు, ఆడియో విజువల్ పరికరాలు, 4,800 పుస్తకాలతో లైబ్రరీ, సోలార్ ప్యానెల్స్‌తో కూడిన మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 62 గదుల్లో ఏకంగా 2,906 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మెరుగైన విద్య అందుతుండటంతో ఏటా ఇక్కడి విద్యార్థులు పదుల సంఖ్యలో ట్రిపుల్ ఐటీ సీట్లు సాధిస్తూ సత్తా చాటుతున్నారు.











