ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే మహానాడు వరుసగా రెండోసారి వర్చువల్ పద్ధతిలో జరిగిన విషయం తెలిసిందే.రెండురోజుల మహానాడులో మొత్తం 15 తీర్మానాలను పార్టీ ఆమోదించింది.పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారకరామారావుకి నివాళి అర్పించిన తరవాత సంతాప తీర్మానం అనంతరం పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.రెండు రోజుల్లో ఈ తీర్మానాలపై చర్చ జరిగింది.మొత్తం 15 తీర్మానాల్లో తెలంగాణకు చెందినవి 5 తీర్మానాలుండగా ఏపీకి చెందిన తీర్మానాలు పది ఉన్నాయి.మహానాడు కార్యక్రమంలో పలువురు నాయకులు తమతమ అభిప్రాయాలను చెప్పడంతో పాటు ఏపీలో వైసీపీ ప్రభుత్వ పనితీరుపై దమ్మెత్తి పోశారు.తెలంగాణలోనూ కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు.
అధికార మదంతో వ్యవహరిస్తున్న వైసీపీ : చంద్రబాబు
ఈ రెండు రోజుల మహానాడు కార్యక్రమంలో పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం కావడం,ఆక్సిజన్ లేక పలువురు ప్రజలు మరణించడాన్ని ప్రస్తావించారు.వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచింది టీడీపీ పార్టీయేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని,అన్నింటినీ గుర్తుపెట్టుకుంటున్నామన్నారు.కొవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను వదిలిపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేసి కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారన్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం వేధింపుల వల్ల మరణించిన వారి పేర్లను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా తలొగ్గేది లేదన్నారు.తప్పుడు కేసులతో అచ్చెన్నాయుడు,కొల్లు రవీంద్ర,ధూళిపాళ్ల నరేంద్ర,జేసీ ప్రభాకర్ రెడ్డి,నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,బీసీ జనార్దన్‌రెడ్డి వంటి టీడీపీ నేతలను అరెస్టు చేశారని విమర్శించారు.పోలీసులు కూడా కొన్నిచోట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని,పోలీసులు అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే టీడీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవద్దని,ఎదురు తిరిగి ప్రైవేటు కేసులు వేయాలని,పార్టీ అండగా ఉంటుందన్నారు.స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.కొవిడ్ నియంత్రణ,పోలవరం ప్రాజెక్టు,వ్యవసాయ సంక్షోభం, నవరత్నాల అమల్లో వైఫల్యం,ధరల పెంపు,అన్నదాతల ఇబ్బందులు,వైద్యఆరోగ్య శాఖ పనితీరు తదితర అంశాలపై నాయకులు మాట్లాడారు.వచ్చే ఏడాది మార్చి నాటికి పార్టీ ఏర్పడి 40ఏళ్లవుతోందని చెబుతూ చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యాలు చేశారు.1983లో తొలి మహానాడుకు దేశంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించామని,విభజన తర్వాత ఏపీ, తెలంగాణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు.అధికారంలోకి వచ్చాక 24 గంటలూ తాను ప్రజల కోసమే ఆలోచించానని, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలతో కార్యకర్తలు అవస్థలు పడుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read ;- లోకేశ్ అడుగు జాడల్లో దేవాన్ష్ : ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, నివాళి అర్పించి!

వైసీపీ పాలనపై నాయకుల విమర్శలు
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,ఎన్టీఆర్ తనయుడు,హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ,ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,ఎంపీలు రామ్మోహన్ నాయుడు,జయదేవ్ ,నాయకులు గౌరు చరిత,సోమిరెడ్డి,దేవినేని ఉమ,బచ్చుల అర్జునుడు,గద్దె రామ్మోహన్ , వర్ల రామయ్య,దీపక్ రెడ్డి,వంగలపూడి అనిత,తిరునగరి జోత్స్న,నెల్లూరు దుర్గాప్రసాద్,జ్యోజిరెడ్డి,కృష్ణమోహన్,అరవింద్‌కుమార్‌గౌడ్,తాజొద్దీన్‌తో పాటు నాయకులంతా మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారు.పలువురు నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనపై దుమ్మెత్తి పోశారు.ఇక తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా పార్టీ ముందుకు రావాలని తెలంగాణ టీడీపీ నాయకులు కోరారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో టీడీపీ పాత్ర కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.సంపద సృష్టి తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైందని పేర్కొన్నారు.తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారంలో సీఎం కేసీఆర్ సర్కారు విఫలమైందని పేర్కొన్నారు.
Must Read ;- ఎన్టీఆర్ రత్నం కాదా?.. భారతరత్న ఎందుకు రాదు?











