టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై జగన్ సర్కారు వరుస పెట్టి కేసులు నమోదు చేస్తోంది.కర్నూలు జిల్లాలో కరోనా కొత్త వేరియంట్‌కు సంబంధించి చంద్రబాబు అసత్య ప్రచారంతో ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారన్న ఒకే ఒక్క ఆరోపణతో జగన్ సర్కారు… ఆయనపై కేసుల పరంపరకు తెర తీసింది.అయితే ఈ ఎపిసోడ్‌లో బాబుపై ఎక్కడికక్క కేసులు నమోదు చేయడం మినహా జగన్ సర్కారుకు చంద్రబాబును అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం లేదన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది.వెరసి చంద్రబాబుపై జగన్ కక్షసాధింపు మేకపోతు గాంభీర్యమేనని చెప్పక తప్పదు.
రోజుకు 20 వేల కరోనా కేసులు నమోదు
ఏపీలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.రోజుకు 20 వేల కొత్త కేసులు నమోదు అవుతుండగా.. మంగళవారం మరణాల సంఖ్య తొలిసారిగా సెంచరీ దాటేసింది.ఈ లెక్కన ఏపీలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ఇలాంటి నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఎన్440కె రకం వేరియంట్ వెలుగు చూసిందని, ఇది సాధారణ వైరస్ కంటే 10-15 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని,ప్రజల్లో మానసిక వేదన,అధైర్యం కల్పించాయని పేర్కొంటూ చంద్రబాబుపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఫిర్యాదులను ఆధారం చేసుకుని ఇప్పటికే కర్నూలు వన్ టౌన్‌లో ఓ కేసు నమోదు కాగా… నిన్నటికి నిన్న ఇదే ఆరోపణతో గుంటూరు నగరంలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లోనూ చంద్రబాబుపై మరో కేసు నమోదు అయ్యింది. ఇదే ఆరోపణతో తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లోనూ మరో కేసు నమోదైపోయింది.పరిస్థితి చూస్తుంటే… వీలయినన్ని చోట్ల చంద్రబాబుపై ఫిర్యాదులు ఇప్పించి కేసులు బుక్ చేయించడమే లక్ష్యంగా జగన్ సర్కారు కదులుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ తరహా కేసులకు భయపడే రకమే కాదు..
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు… ఈ తరహా కేసులకు భయపడే రకమే కాదు.ఈ విషయంలో ఇటు టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేతలు,ఇతర పార్టీ నేతలకు కూడా స్పష్టమైన అవగాహన ఉందన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు.సరే… కేసులు పెడుతున్నారు కదా… మరి చంద్రబాబును ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారిందని చెప్పాలి.సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తాను ఎలాగైతే జైలుకు వెళ్లి వచ్చానో,అదే మాదిరి చంద్రబాబును కూడా జైలుకు పంపి తీరాలన్న కసితో సాగుతున్న జగన్… ఆ దిశగా ఎప్పటికీ విజయం సాధించలేరనే చెప్పాలి.ఎందుకంటే… సింగిల్ ఆరోపణతో చంద్రబాబుపై ఎక్కడిక్కడ కేసులు పెడుతున్న జగన్ సర్కారు… ఈ కేసులో చంద్రబాబుకు ఇప్పటిదాకా కనీసం విచారణకు హాజరుకావాలన్న కనీస నోటీసును జారీ చేయలేకపోయింది.నోటీసులతో హడావిడిగా హైదరాబాద్ బయలుదేరిన కర్నూలు వన్ టౌన్ సీఐ… జగన్ సర్కారు పెద్దల ఆదేశాలతో చంద్రబాబు గుమ్మం తొక్కకుండానే వెనక్కు తిరిగి వచ్చేశారు.
ప్రతివ్యూహంతో టీడీపీ నేతల షాక్
చంద్రబాబును బుక్ చేసేందుకు జగన్ అండ్ కో ఓ వ్యూహం రచిస్తే…రాజకీయాల్లో ఆరితేరిపోయిన టీడీపీ నేతలు ప్రతివ్యూహాన్ని రచించి షాకిచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైద్య రంగానికి చెందిన కొందరు నిపుణులు చెబితేనే.. కర్నూలు జిల్లాలో కొత్త వేరియంట్ అని చంద్రబాబు చెప్పిన తరహాలోనే జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు కూడా కర్నూల్లో కొత్త వేరియంట్ అంటూ ప్రకటించారు.ఇదే విషయాన్ని క్షణాల్లో పట్టేసిన టీడీపీ శ్రేణులు.. చంద్రబాబుపై తొలి కేసు బుక్కైన కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే సీదిరిపై కంప్లైంట్ చేశారు.చంద్రబాబు చేసిన మాదిరే సీదిరి కూడా ప్రకటన చేశారు కదా… మరి బాబుపై పెట్టిన మాదిరే సీదిరిపై కేసు నమోదు చేయండంటూ సదరు ఫిర్యాదులో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.దీంతో దిమ్మతిరిగిపోయిన వైసీపీ ప్రభుత్వం.. చంద్రబాబుకు నోటీసుల జారీపై వెనక్కు తగ్గిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.మొత్తంగా చంద్రబాబుపై పెట్టిన కేసులో పస లేదని ఆలస్యంగా తెలుసుకున్న జగన్ సర్కారు.. వెంటనే వెనక్కు తగ్గితే బాగోదన్న భావనతో ఎక్కడికక్కడ చంద్రబాబుపై కేసులు పెట్టిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.