#BharatRatnaForNtr – మహానటుడు నందమూరి తారక రామారావు 99వ జయంతి సందర్భంగా ఈ హేజ్ ట్యాగ్ వైరల్ కాకమానదు. మహానటుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న ఎందుకు ఇవ్వరు? ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్న ఇది.
భారత రత్న ఎవరికి ఇస్తారు అంటే సమాధానం చెప్పేవారు చాలామందే ఉంటారు. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడలు, రాజకీయం తదితర రంగాలలో అత్యుత్తమ కృషికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇందులో కళారంగం అనేది మొదటే ఉంది. మరి భారత దేశంలో కళారంగంలో అత్యున్నత సేవలు అందించిన ఘన మన భారత దేశంలో ఒక్క ఎన్టీఆర్ కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు. కళారంగానికి ఆయన అందించిన సేవలు నభూతో నభవిష్యతి. మరి పాలకుల కళ్లకు ఇప్పటిదాకా ఎన్టీఆర్ ఎందుకు కనిపించలేదు. అసలు ఎప్పట్నుంచో ఈ డిమాండు ఉన్నా పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఒక వ్యక్తిని అత్యున్నత పదవికి ఎంపిక చేసే విషయంలో కూడా రాజకీయాల ప్రమేయం ఉండాలా? ఈ అత్యున్నత పురస్కారం ప్రదానం మీద ఎప్పట్నుంచో నీలినీడలు ఉన్నాయి. ఈ పురస్కారం పొందిన విదేశీయులు కూడా ఉన్నారు. స్వదేశంలో అత్యున్నత సేవలు అందించినా అవార్డులు రాని వారు ఉన్నారు. అసలు దక్షిణాది వారికి ఈ పుర్కస్కారం ఇవ్వడంలోనే చిన్న చూపు ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. మిగతా వారి విషయాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ కు ఈ అర్హత ఉందో లేదో చూద్దాం.
కళా రంగంలో ఎన్టీఆర్
సినిమా అనేది కళారంగమే. ఎంఎస్ సుబ్బులక్ష్మి, పండిట్ రవిశంకర్, లతా మంగేష్కర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, పండిట్ భీంసేన్ జోషి లాంటి వారు తమ తమ రంగాల్లో సేవలు అందించారు కాబట్టి వారిని భారతరత్న వరించింది. అసలు కళా రంగంలో ఎన్టీఆర్ ఎంతకాలం ఏ స్థాయిలో ఉన్నారు? ఈ రంగాన్ని ఆయన ఏంచేశారు? అని వెనక్కి వెళ్లి ఆలోచించి చూస్తే అర్థమవుతుంది. నటన, దర్శకత్వం, స్టూడియో స్థాపన, చిత్ర నిర్మాణం.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో చేశారు.. ఎంతో చేశారు. అంత సేవ చేయకపోతే ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని 9 నెలల వ్యవధిలో ఓడించి అధికార పీఠాన్ని అధిష్ఠించగలిగేవారా? ప్రజలు ఒక వ్యక్తికి పట్టంకట్టడం అంటే మామూలుగా జరిగే విషయం కాదు.
ఆయనకు ఈ అత్యున్న పురస్కారం రాకపోవడం ఎవరి వైఫల్యం? 1954 నుంచి భారత ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పటిదాకా ఎంతోమంది ఈ అవార్డును పొందగలిగారు. రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వెళ్లినా కేంద్ర ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేస్తోందన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఈ పురస్కారం ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నుంచి కేంద్రానిక ప్రతిపాదనలు వెళ్లినా అవి బుట్టదాఖలైన విషయాన్ని మరువరాదు. పీవీ నరసింహారావుకు ఈ పురస్కారం ఇవ్వాలన్న ప్రతిపాదనల విషయంలోనూ అలాగే జరిగింది. నిజం చెప్పాలంటే
ఈ వరుసలో ముందుండే పేరు నందమూరి తారక రామారావు. 1923 మే 28న ఆయన జన్మించారు. ఆయన శతజయంతి ఉత్సవాలలోకి కూడా అడుగుపెట్టబోతున్నాం. రంగస్థలం నుంచి చిన్ వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. పురాణ పురుషులంటే ఇలానే ఉంటారని నిరూపించారు. శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం ఎన్నో ఉద్యమాలు నడిచాయి. అసలు శ్రీరాముడు ఇలానే ఉంటాడని ఆయన చరిత్రను అశేష జనవాహినికి అందించిన ఘనత నందమూరి తారక రామారావుది. మన దేశం చిత్రంతో ప్రారంభమైన ఆయన సనీ ప్రస్తానం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావందాకా సాగిపోయింది.
44 ఏళ్ల సినీ జీవితంలో ఆయన దాదాపు 400 చిత్రాల్లో నటించారు. వాటిలో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించారు. ఎన్టీఆర్ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. ఆయన శతజయంతి సందర్భంగానైనా ఆయనకు ఈ పురస్కారం రాకపోతే ఇక ‘కళా రంగంలో సేవ’ అనే మాటకు అర్థమే ఉండదు. పోనీ కళను పక్కన పెట్టి రాజకీయం అనే విషయానికి వచ్చినా ఆయనకు ఈ పురస్కారం వచ్చి తీరాలి.
తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ప్రజరంజకమైన పథకాలతో జనం హృదయాలను చూరగొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు. ఎన్టీఆర్ పవేశ పెట్టిన పథకాలను ఎన్నా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎవరికీ గుర్తురావడం లేదు. భారత రత్న అనే పురస్కారం చరిత్రకు సాక్ష్యంగా ఉండాలి. అప్పుడే దానికి సార్థకత, అందుకున్న వ్యక్తులకూ వన్నెతెచ్చేలా ఈ పురస్కారం ఉండాలి.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- శతజయంతి దిశగా ఎన్టీఆర్ మహానట ప్రస్థానం











