ఇప్పుడు తమిళంలో బాగా బిజీగా ఉన్న హీరో విజయ్ సేతుపతి . ప్రస్తుతం ‘800’ అనే సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎస్. శ్రీపతి దర్శకత్వం వహిస్తుండగా, ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అందులో విజయ్ అచ్చంగా మురళీధరన్ లాగానే కనిపిస్తున్నాడు.
కాని శ్రీలంకన్ బౌలర్ అయిన ముత్తయ్య పాత్రలో విజయ్ నటించడం కొందరు తమిళలకు, విజయ్ సేతుపతి అభిమానులకు నచ్చడంలేదు. దానికి కారణం ఎల్టీటీటీఈ చీఫ్ ప్రభాకరనే . శ్రీలంక లో తమిళుల హక్కుల కోసం ప్రభాకరన్ ఎన్నో పోరాటాలను నడిపిన సంగతి తెలిసిందే. ప్రభాకరన్ అంటే శ్రీలంక ప్రభుత్వమే భయపడేది. ప్రభాకరన్ అనుచరుడి సహాయంతో ఆయనను శ్రీలంక ప్రభుత్వమే అంతం చేయించింది.
ప్రభాకరన్ విషయమై లంక పాలకులంటే తమిళ ప్రజలకు ఎప్పుడూ ఆగ్రహమే. అందుకనే విజయ్ సేతుపతి శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ చేయడం అక్కడి వారికి ఇష్టం లేదు. ముత్తయ్య మురళీధరన్ తమిళ్ వాడైనా ప్రభాకరన్ విషయంలో శ్రీలంక ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడని తమిళ్ ప్రజలు ఆయనపై మండిపడుతూ ఉంటారు. విజయ్ సేతుపతి అభిమానులు ఒక అడుగు ముందుకేసి ప్రభాకరన్ బయోపిక్ లో నటించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతికి తమిళ లిరిసిస్ట్ తామరై ఒక బహిరంగ లేఖ రాసాడు. అందులో ఆయన మురళీధరన్ తమిళ్ వాడైనా తమిళ ఈలం నినాదానికి మద్దతు ఇవ్వలేదని తెలిపారు.
మురళీధరన్ తమిళులను అణచివేతకు గురిచేసిన ప్రభుత్వ రాజకీయాల్లో ఉన్నారని, మీరు ఆ బయోపిక్ వదిలేసి వేలుపిళ్లై ప్రభాకరన్ బయోపిక్ చేయండని కోరాడు. ఆ పని చేస్తే తమిళ జాతి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు. ఈ లేఖతో ప్రభాకరన్ బయోపిక్ ను విజయ్ చేయాలని అనేక వర్గాల నుండి తమిళులు, ఆయన అభిమానులు కోరుతున్నారు. విజయ్ సేతుపతి తన అభిమానులు, తమిళ్ ప్రజల కోరికను తిరిస్తాడో లేదో చూడాలి మరి.











