సింగిల్ కేరక్టర్ తో సినిమాలు వచ్చాయి. సింగిల్ డేలో చిత్రీకరించిన సినిమాలు చూశాం. సింగిల్ లొకేషన్ లో చిత్రీకరించుకొన్న సినిమాలూ విడుదలయ్యాయి. కానీ ఇప్పుడు ఇండియాలోనే తొలిసారిగా.. సింగిల్ షాట్ తో ఒక పూర్తి సినిమా తెరెక్కిందట. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. నమ్మి తీరాల్సిన నిజం అది. సినిమా పేరు ‘మహాప్రస్థానం’. థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కిందట. జానీ అనే కొత్త దర్శకుడు ఈ ప్రయోగం చేస్తున్నాడు. ప్రయత్నం మంచిదే కానీ.. ఇలాంటి సినిమా ప్లాన్ చేసినప్పుడు ఏ క్రేజున్న హీరోనో ఎంపిక చేసుకుంటే.. సినిమాకి మంచి ప్రచారం దక్కేది. కానీ కొంతకాలంగా ఒక్క హిట్టూ కొట్టలేకపోతున్న యంగ్ హీరో తనీష్ ఇందులో హీరోగా నటిస్తున్నాడనే సరికి ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లిందనే కామెంట్స్ పడుతున్నాయి.
బాలనటుడిగా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన తనీష్ .. రవిబాబు ‘నచ్చావులే’ సినిమాతో హీరో అయ్యాడు . తొలి సినిమాతో మంచి మార్కులు వేయించుకున్న తనీష్ ఆ తర్వాత ‘మేం వయసుకు వచ్చాం, రైడ్’ లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత అతడి కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమానే లేకుండా పోయింది. నక్షత్రం లో నెగెటివ్ రోల్ చేసినా.. బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా వచ్చినా.. ఫలితం లేకపోయింది. ప్రస్తుతం పూర్తిగా మార్కెట్ కోల్పోయిన స్థితిలో ఉన్న తనీష్ కు ..ఇప్పుడు కొన్ని అవకాశాలు వస్తున్నాయంటే దానికి కారణం బిగ్ బాస్ షో అనే చెప్పాలి.
ఆ మధ్య రంగు లాంటి రెండు మూడు సినిమాలతో వచ్చినా.. అతడికి విజయం మాత్రం సిద్ధించడం లేదు. అందుకే ఇప్పుడు మనోడు ప్రయోగాల బాట పట్టాడని అంటున్నారు. ‘మహాప్రస్థానం’ లాంటి సినిమాతో మళ్ళీ హిట్టు గట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. సెప్టెంబర్ 7 తనీష్ పుట్టిన రోజు సందర్భంగా మహాప్రస్థానం టీజర్ ను విడుదల చేశారు మేకర్స్ . సింగిల్ షాట్ లో పూర్తి చేసిన సినిమాగా దీనికి బాగానే పబ్లిసిటీ చేశారు. టీజర్ చూస్తుంటే.. ఇదో క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. ఇలా సింగిల్ షాట్లోనే సినిమా మొత్తం ఉంటే.. ప్రేక్షకులు చూడ్డానికి బోర్ ఫీలయ్యే ప్రమాదముంది.
అందుకే సినిమాలో సమ్ థింగ్ స్పెషల్ లాంటిదేదైనా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి ప్రయత్నం ఇందులో చేశారో లేదో సినిమా విడుదలయ్యే వరకూ తెలియదు. విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమాదాస్’ సినిమా క్లైమాక్స్ లో 20 నిమిషాలు ఇలాంటి సింగిల్ షాట్ ప్రయోగమే చేశారు. నిజానికి ఆ విషయంలో దాని ఒరిజినల్ వెర్షన్ మలయాళ అంగమాలి డైరీ ని ఫాలో అయ్యారనుకోండి. ఇప్పుడు పూర్తి స్థాయిలో సింగిల్ షాట్ లో ఒక సినిమా వస్తోందంటే.. మెచ్చుకోదగ్గదే. పూర్తి వయోలెన్స్ నేపథ్యంలో సాగే ‘మహా ప్రస్థానం’ సినిమా తనీష్ కు మళ్లీ వరస ఆఫర్స్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.











