బెజవాడ హవాలాకు అడ్డాగా మారింది. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వేలాది మంది సౌదీతోపాటు, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారి వద్ద నుంచి డాలర్లు కొనుగోలు చేసి హైదరాబాద్ తరలిస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కోటి 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ముందుగా వచ్చిన సమాచారం మేరకు నరసాపురం నుంచి హైదరాబాద్ తరలిస్తున్న హవాలా డబ్బు ఉంచిన కారును విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో పోలీసులు అడ్డగించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారు వెనుక సీటులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బాక్సు నుంచి పోలీసులు కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఏమిటీ హవాలా?
విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఆ దేశాల కరెన్సీని జీతాల రూపంలో పొందుతారు. ఆ డబ్బును బ్యాంకుల్లో రూపాయిల్లోకి మార్చుకోవాలి. ఉదాహరణకు అమెరికా డాలర్ కొనుగోలు ధర రూ.76, అమ్మకం ధర రూ.73 నడుస్తోంది. ఈ వ్యత్యాసమే హవాలా మాఫియాకు వరంగా మారింది. బ్యాంకుల ద్వారా విదేశీ కరెన్సీని రూపాయిల్లోకి మార్చుకుంటే రిమిటెన్సు టాక్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే విదేశాల్లో ఉద్యోగాలు చేసే కొందరు ఉద్యోగులు హవాలా మాఫియాను ఆశ్రయించి డాలర్లను రూపాయిల్లోకి మార్చుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచో జరగుతున్నా పోలీసులకు ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడే వారిని పట్టుకుని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు.
శాఖల సమన్వయలోపంతో చెలరేగుతోన్న హవాలా మాఫియా
పోలీసులు, ఆదాయపన్ను శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం హవాలా మాఫియాకు వరంగా మారింది. పోలీసులు కేవలం చెక్ పాయింట్ల వద్ద అనుమానం వచ్చిన వాహనాలు చెక్ చేసి అధిక మొత్తంలో డబ్బుతరలిస్తూ ఆధారాలు చూపకపోతే వారిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చేతులు మారుతున్నా పోలీసులు పట్టుకునేది గోరంతే.
వారికి ఆదాయపన్ను శాఖ అధికారులను నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో హవాలా మాఫియాను అదుపుచేయడం కష్టంగా మారింది. కొందరు హవాలా వ్యాపారులు దొంగ బిల్లులు, సూట్ కేస్ కంపెనీలు సృష్టించి దర్జాగా హవాలా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు స్పాట్ లో ఉంటేనే వారిని పట్టుకోవడం సాధ్యం అవుతుంది. పోలీసులకు ఏవో కొన్ని బిల్లులు చూపించి నగదు తరలిస్తున్న సందర్భాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఆదాయపన్ను శాఖ సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే హవాలా మాఫియాకు అడ్డుకట్ట వేయవచ్చు.











