అక్కినేని వారసుడు అఖిల్ కు సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చేసిందండోయ్. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు. చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం భారీ స్థాయి లో రూపొందనుంది . ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్ 2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటిన ఈరోజు వచ్చింది. అఖిల్ అక్కినేనికి ఇది 5వ చిత్రం అవుతుంది. 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రారంభించిన ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ భారీ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని.. ఇప్పటిదాకా సరైన హిట్ పడకుండా.. కెరీర్ కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటిదాకా రకరకాల జోనర్ లలో వేర్వేరు దర్శకులతో ప్రయోగాలు చేసినా.. ఫలితం దక్కలేదు. అక్కినేని మూడోతరం వారసుల్లో ఒకరైన అఖిల్ కెరీర్ ఇంకా స్థిరపడలేదు. ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనైనా మంచి హిట్ పడుతుందా, ఫేట్ మారుతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.