గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం ..
గుడివాడ కేసినో నిర్వహిణపై జగన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు తమ ఉద్యమం ఆగదని తెలుగుదేశం నిర్ణయించింది. కేసినో నిర్వహణ అంశాన్ని జాతీయ దర్యాప్తు సంస్థలకు విచారణ బాధ్యతలు అప్పగించాలని, మంత్రి కొడాలి నాని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అలానే ఇదే విషయంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుడివాడ ‘కె’ కన్వన్షన్ లో నిర్వహించిన గోవా కేసినో పై తెలుగు దేశం ఒక నిజ నిర్ధారణ కమిటిని వేసింది. కమిటీ నివేదికను తయారు చేసి, మంగళవారం చంద్రబాబును కలిసి అందజేశారు. కేసినో నిర్వహణ, అందులో మంత్రి ప్రమేయం తదితర అంశాలపై తాము సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో సభ్యులు ఆయనకు అందజేశారు. మంత్రి ప్రమేయం ఉన్నందున విచారణను సీబీఐ తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ తోపాటు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు సీబిఐను నేరుగా కలిసి కొడాలిపై ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. అలానే నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, గుడివాడలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిశ్చయించారు.
కోట్లలో చేతులు మారాయి..
గుడివాడ కేసినోలో ఆడించిన జూదం వందల కోట్ల రికార్డును క్రాస్ చేసింది. సుమారు రూ. 250 కోట్లు చేతులు మారినట్లు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఆరోపిస్తుంది. చట్టాలను అతిక్రమించి తన సొంత స్థలంలో మూడ్రోజులపాటు కేసినో నడిపించిన మంత్రి కొడాలి నాని జైలుకు పంపేవరకు తమ పోరాటం ఆగదని కమిటీ సభ్యులో ఒకరైన టీడీపీ సీనియర్ లీడర్ వర్ల రామయ్య చెప్పారు. ఈడీ, డీఆర్ఐ, నిఘా, ఐటీ వంటి సంస్థలు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని, న్యాయ జరగకుంటే కోర్టును కూడా ఆశ్రయిస్తామని వర్ల పేర్కొన్నారు. బుద్ధా వెంకన్న కేవలం విమర్శలే చేశారని, మరి మంత్రి నోటికొచ్చినట్లు తిడితే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
Must Read:-గుడివాడలో గోవా కల్చర్..! మంత్రి ఇలాకాలో వంద రకాలతో జూద సంబరాలు..!!