మల్టీస్టారర్ సినిమా అంటేనే పెద్ద తలనొప్పి వ్యవహారం. దర్శకుడు ఏ హీరో వైపు మొగ్గు చూపినా వేరే హీరో అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతారు. ఇప్పుడు రాజమౌళి విషయంలో అదే జరుగుతోంది. రాజమౌళి మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. తమ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నారు. ఎన్టీఆర్ – రాజమౌళి మధ్య అనుబంధం ఈనాటిది కాదు. గతంలో స్టూడెంట్ నంబర్ 1తో వీరి ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి.
ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విడుదలకు సిద్దంగా ఉంది. వీరిద్దరూ నాలుగు సినిమాలు చేయడంతో వీరి మధ్య కూడా అలాంటి స్నేహ బంధమే ఉంది. కానీ ఓ ప్రత్యేక కారణంతో ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి మీద మండిపడుతున్నారు. విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కు సంబంధించి రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్న అంశాన్ని ఎత్తి చూపుతున్నారు. ఆ వీడియో క్లిప్ ను షేర్ చేస్తున్నారు. ఇందులో రాజమౌళి రామరాజు, భీమ్ పాత్రలు రెండూ ఇష్టమని చెప్పారు.
అయితే రామ్ పాత్ర పోషించిన తీరు పట్ల కొంచెం ఎక్కువ మక్కువ చూపినట్టు ఎన్టీఆర్ అభిమానులకు అనిపించింది. ఆ వ్యాఖ్య ఎన్టీఆర్ అభిమానులకు నచ్చకపోవడంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘మీకు నిజంగా రామ్ పాత్ర నచ్చితే మల్టీస్టారర్ సినిమా ఎందుకు చేశారు? ఆ ఒక్క క్యారెక్టర్ తోనే సబ్జెక్ట్ డిజైన్ చేసుకుని ఉండొచ్చు కదా? మేం మొదట్నుంచీ చూస్తూనే ఉన్నాం పోస్టర్లు, ఇతర వీడియోలలో రామ్ పాత్రకే పెద్ద పీట వేస్తున్నారు. ఆఖరికి ట్రిపుల్ ఆర్ ట్రైలర్ లో కూడా రామ్ పాత్ర ఎలివేషన్ మాత్రమే హైలైట్ అయ్యింది. అలాంటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో భీమ్ పాత్ర ఎందుకు చేయించారు?’ అంటూ ఓ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాటు నాటు పాట విషయంలోనూ రామ్ చరణ్ ను ఎలివేట్ చేసినట్టుగా అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఇలాంటి స్పందన వస్తుందని రాజమౌళి కూడా ఊహించలేదు. ఇప్పుడు ట్విట్టర్ లో ఇదే ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా చేస్తే ఇలాంటి తలనొప్పులే ఉంటాయని ఇప్పుడు రాజమౌళికి అర్థమైనట్టుంది. మరి రాజమౌళి దీన్ని ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి. సినిమాలో కూడా అదే కనిపిస్తే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో మరి.