నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన షూటింగ్ తిరిగి ఈ మధ్యనే మొదలై శరవేగంగా జరుగుతోంది. బాలయ్య కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమాపై ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర విలన్ గా నటిస్తున్నాడని సమాచారం.
నవీన్ చంద్ర ఒక మినిస్టర్ కొడుకుగా పూర్తి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని, చాలా పవర్ ఫుల్ గా ఆ పాత్రను దర్శకుడు బోయపాటి డిజైన్ చేశాడని తెలుస్తోంది. విలన్ ను పవర్ ఫుల్ గా చూపించడంలో బోయపాటి దిట్ట. ‘లెజండ్’ సినిమాలో సాఫ్ట్ హీరో జగపతిబాబును ఎలా చూపించాడో తెలిసిందే. అలాంటిది నవీన్ చంద్రను తన సినిమాలో బోయపాటి ఇంకెలా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవీన్ చంద్ర కూడా వస్తున్న ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుని టాలీవుడ్ లో తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మొన్నటికి మొన్న నవీన్ చంద్ర, ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’లో బాల్ రెడ్డి అనే ఒక కీలక పాత్రలో మెరిసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక బాలయ్య – బోయపాటి సినిమా కూడా తన సినీ కెరియర్ కు ప్లస్ అవుతుందని నవీన్ భావిస్తున్నాడు.
ప్రస్తుతం బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పై కిలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇప్పటికే టీజర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య – బోయపాటి చేసిన గత చిత్రాలైన ‘సింహ’, ‘లెజెండ్’ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించాయి. అందుకే మూడో సినిమాపై కూడా అంచనాలు తార స్థాయికి చేరాయి. తమన్ సంగీతం అందిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాలయ్య ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.











