కల్తీసారా, జే బ్రాండ్ మద్యం అమ్మకాల పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టిడిపి పిలుపునిచ్చింది. నాసిరకం మద్యం, కల్తీసారాతో ప్రజల ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా, ప్రాణాలు సైతం పోతున్నా నేపధ్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాల విషయంలో జగన్ సర్కార్ తీరుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో కల్తీ సారా ఏరులై పారుతోందని… కల్తీ మందు తాగి జనాలు చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి. జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న కల్తీసారా మరణాలపై చర్చించాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గత నాలుగైదు రోజులుగా పట్టుబడుతున్నా, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మార్చి 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నాయి. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో తెలుగుదేశం నాయకులు ఈ నిరసనలు చేపట్టనున్నారు.
Must Read:-అక్రమ ఇసుక దందాపై కదంతొక్కిన టీడీపీ! ఖాకీల క్రౌర్యం.. టీడీపీ నేతలపై లాఠిచార్జీ!!