పాత కేసును తిరగతోడి మరి కక్షసాధింపా?
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి పొద్దుపోయాక విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబు తెలిసిన వారి వేడుకకు హాజరై పటమటలంకలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే సీఐడీ అధికారులు ఆయనను తమతో తీసుకెళ్లిపోయారు. గతంలో ఆయన వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్ అయ్యారు. ఈ నేపధ్యంలో పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నప్పటికీ.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అశోక్ బాబును అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. పీఆర్సీ రగడ రగుతున్న సమయంలోనే ఆయనపై వైసీపీ ప్రభుత్వం మరోమారు పాత ఆరోపణలను బయటకు తీసిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం వ్యూహంలో భాగంగానే తనపై లోకాయుక్తకు కొత్తగా ఫిర్యాదు చేయించినట్లు అశోక్ బాబు ఆరోపిస్తున్నారు. లోకాయుక్తకు అందిన ఫిర్యాదు మేరకు సీఐడీని ఆదేశించినట్లు తెలుస్తోంది.
శాఖ పరమైన విచారణలో నెగ్గి.. రాజకీయ పంతంలో ఓడిందా?
వాణిజ్య పన్నుల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిగ్రీ చదవకుండానే చదివినట్లు చూపించాలరని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణ వచ్చాయి. అయితే దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్ బాబు అప్పట్లో వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్ అధికారులు కూడా విచారణ జరిపి.. ఆయనపై అభియోగాలను ఉపసహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయంలోనే ఈ కేసు ‘క్లోజ్’ అయ్యింది. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షుడిగా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్జీవో నేతగా మంచి గుర్తింపు సాధించారు. ఆ తరువాత టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఉద్యమాలతో అట్టుడికిపోతుంది. ఈ నేపధ్యంలో అశోక్ బాబుపై తనదైనశైలిలో ఉద్యోగుల పక్షన నిలబడి, ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యోగుల ఉద్యమానికి స్ఫూర్తినిచ్చే అనేక విషయాలను మీడియా ముఖంగా ఆయన ఆలోచనలు పంచుకున్నారు. దీనిపై ప్రభుత్వం కక్ష కట్టింది. కేవలం రాజకీయ పంతం కోసం వైసీపీ ప్రభుత్వం అశోక్ బాబును అరెస్ట్ చేసిందని టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా జగన్ రెడ్డి ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే లోకాయుక్తలో ఫిర్యాదు, అనంతరం సీఐడీ అరెస్ట్ జరిగిపోయిందని తెదేపా మండిపడుతోంది.











