2016లో వెలువడిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో 99 సీట్లు సాధించి కారు స్పీడుకు బ్రేకులు లేవనుకున్న టిఆర్ఎస్ పార్టీకి ఈసారి జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కారు పంక్చరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు తెలుపుతున్నాయి. ఏ ఎన్నికైన తమకు ఎదురు లేదంటూ దూసుకుపోయే కారు స్పీడుకు ఈ ఎన్నికల్లో స్పీడ్ బ్రేకు పడనుందని ఆ సర్వేల ద్వారా తెలుస్తోంది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘోరమైన ఓటమిని చవిచూసే అవకాశం ఉందని క్యూ న్యూస్ సంస్థ చేసిన ప్రీపోల్ సర్వేల ద్వారా తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ముందంజ!..
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో క్యూ న్యూస్ సంస్థ.. హైదరాబాద్ లోని నియోజకవర్గాల వారిగా, డివిజన్ల వారిగా సర్వే చేయించినట్లు సమాచారం. అయితే ఈ సర్వేల్లో షాకింగ్ విషయాలు వెలువడ్డాయట. టిఆర్ఎస్ పార్టీకి ఘోర ఓటమి తప్పదని ఆ సర్వేలో తేలినట్లు తెలిసింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎంచుకుని పట్టం కుడుతున్నారట. గత ఎన్నికల్లో 99 సీట్లను కైవసం చేసుకున్న టిఆర్ఎస్ పార్టీ ఈసారీ జరగబోయే ఎన్నికల్లో అందులో కేవలం 10వ వంతు సీట్లు మాత్రమే వస్తున్నాయని ఆ సర్వేలో తేలినట్లు తెలిసింది. అంటే టిఆర్ఎస్ పార్టీ 100 సీట్లలో కేవలం 10 వరకు సీట్లు మాత్రమే గెలవబోతుందని క్యూ న్యూస్ సంస్థ చేసిన సర్వేలో తేలిందని సమాచారం.
మూడో స్థానానికి టిఆర్ఎస్!..
గ్రేటర్‌లో మొత్తం 150 డివజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందులో 50 డివిజన్ల వరకు పాతబస్తీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ డివిజన్లలో ఎంఐఎం దే ఆధిక్యత ఉంటుంది. ఇక్కడ మిగితా పార్టీలు కూడా పోటీలో నిలిచినా అవి ఏ మాత్రం విజయాన్ని సాధించలేవు. ఈక్రమంలో మిగితా 100 సీట్లకే ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని క్యూ న్యూస్ సంస్థ మొదట 40 డివిజన్లలో జరిపిన సర్వేలో టిఆర్ఎస్ పార్టీ మూడవ స్థానానికి పడిపోయినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి 18 డివిజన్లలో ఆధిక్యం సాధించి టాప్ ప్లేస్‌లో నిలిస్తే, 13 డివిజన్లలో ఆధిక్యంలో ఉంటూ బిజెపి రెండవ స్థానంలో ఉందట. టిఆర్ఎస్ ఐదు డివిజన్లతో టిడిపి నాలుగు డివిజన్లలో మాత్రమే లీడ్ పొందాయట.
సర్వేలో వెలువడిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయట. ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం ఆయా పార్టీలకు అనుకూల ఫలితాలు వస్తున్నాయట. మేడ్చల్ మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు 50 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని క్యూన్యూస్ చేసిన సర్వే ఫలితాల్లో తేలినట్లు సమాచారం. అలాగే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కూడా బిజెపి పార్టీకే సర్వేలు అనుకూలంగా వచ్చినాయట. మొత్తంగా టిఆర్ఎస్ కు గ్రేటర్ ఎన్నికల్లో గడ్డుపరిస్థతి ఎదుర్కోబోతుందని సర్వేలో తేలినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ క్యూ న్యూస్ సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను నమ్మడానికి ఏమాత్రం వీలులేదని టిఆర్ఎస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఇలాంటి సర్వేలకు నమ్మడానికి లేదని వారు పేర్కొంటున్నారు. గ్రేటర్‌లో గులాబి జెండాను టిఆర్ఎస్ పార్టీ ఎగురవేడం ఖాయమని టిఆర్ఎస్‌శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.











