దుబ్బాకలో ఎన్నికల పోరుకు తెరలేచింది. తెరాస ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అవడంతో అక్కడ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దుబ్బాక వేదికగా తమ సత్తా చాటాలని టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్‌తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా రంగంలోకి దిగారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా ఇక్కడ విజయం సాధించి రాష్ట్రంలో ఎక్కడైనా.. అది ఏ ఎన్నికైనా తమకు తిరుగు లేదనే సంకేతాలను ప్రతిపక్షాలకు ఇవ్వాలనే వ్యూహంతో ప్రచారంలో దూసుకుపోతోంది. దీనికోసం మంత్రి హరీష్ రావు ఎన్నికల బాధ్యతలు తనపై వేసుకొని ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పేరు దాదాపు ఖరారైనట్లే. అలాగే బిజెపి కూడా టిఆర్ఎస్‌కు ధీటుగా ప్రచారంలో దూసుకుపోతోంది. బిజెపి తరుపున ఎన్నికల్లో పోటీ చేసేది రఘునందన్ రావు పేరు కూడా దాదాపు ఖరారైనట్లేనని బిజెపి వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీకంటే బిజెపి ఒక అడుగు ముందే ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో, అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో ఇంకా వెనుకబడే ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరనే అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
కన్ఫామ్ కాని అభ్యర్థి..
అటు బిజెపి, ఇటు టిఆర్ఎస్ పార్టీలు దాదాపు తమ అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల ప్రచారంలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ఇంకా కన్ఫామ్ చేయకపోవడం అక్కడి కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారనేది ఇంకనూ సస్పెన్స్‌గానే ఉంది. అభ్యర్థి ఎవరో ఇంకా తేలకపోవడం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మైనస్‌గా మారనుందనే చర్చ జరుగుతోంది. అభ్యర్థి పేరును ఖరారు చేసుకొని ఎన్నికల ప్రచారంలోకి వెళితేనే ఓటర్లను ప్రభావితం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాకాకుండా అభ్యర్థితత్వంపై చివరి వరకు సీక్రెట్ మెయింటెన్స్ చేస్తే అసలు అభ్యర్థి ఎవరో తెలియకుండా జనం ఓట్లు వేసే అవకాశం తక్కువ ఉంటుంది. చివరి నిమిషంలో కొన్ని రోజుల ముందు అభ్యర్థి పేరు ప్రకటించినా అంతగా ఫలితాలు ఉండవు.
వలస నేత కోసం వెయిటింగా!
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని బరిలో దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసం కొంత మంది పేర్లను పార్టీ పరిశీలిస్తుందని తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, కర్ణం శ్రీనివాస్, మరో ఇద్దరు సీనియర్ నాయకులు టికెట్ కోసం గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరి పేర్లను ఖరారు చేయకుండా పరిశీలిస్తుంది. టీఆర్ఎస్ లో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డికి పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలా? లేక కాంగ్రెస్ నేతలకే టిక్కెట్ ఇవ్వాలా? అనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏమేరకు మద్దతు ఇస్తారనే అంశంపై కూడా పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి పేరు ఖరారు చేయడంలో ఇలా ఆలస్యం చేస్తుండం అది కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.











